Kathi Mahesh Dies: అకస్మాత్తుగా తలెత్తిన శ్వాసకోస సమస్యలు, కత్తి మహేష్ కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు, అభిమానులు
Kathi Mahesh (Photo Credit: IANS)

Chennai, July 10: ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, నటుడు కత్తి మహేశ్‌ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ (Kathi Mahesh Dies) శనివారం కన్నుమూశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న తరుణంలో అకస్మాత్తుగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్‌ మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై (Kathi Mahesh Passed Away) పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి మహేశ్‌ తీవ్రం‍గా గాయపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కత్తి మహేశ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మానవతా కోణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17లక్షల రూపాయలు అందచేసింది. అయినా కూడా మహేశ్‌ ప్రాణాలు దక్కలేదు.

‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేశ్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌-1 ద్వారా సోషల్‌ మీడియాలోనూ కత్తి మహేశ్‌ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. అంతకుముందు నందు హీరోగా నటించిన పెసరట్టు అనే సినిమాను తెరకెక్కించారు. కాగా, హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లోనూ నటించారు.

అనారోగ్యంతో బాలీవుడ్ నటుడు దిలీప్‌ కుమార్‌ కన్నుమూత, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్రసీమ, 1944లో జ్వర్‌ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన దిలీప్ కుమార్

కత్తి మహేశ్‌కుమార్‌ అలియాస్‌ కత్తి మహేశ్‌ ఆంధ్రప్రదేశ్‌, చిత్తూరు జిల్లాలోని పీలేరు పట్టణం దగ్గర ఎల్లమంద అనే గ్రామంలో ఓబులేసు, సరోజమ్మ దంపతులకు 1977లో జన్మించారు. తండ్రి అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్సన్‌ ఆఫీసరుగా పనిచేసేవారు. మహేశ్‌కు ఓ అన్న​, చెల్లి ఉన్నారు. పీలేరు, హర్యానా, అనంతపురంలలో ప్రాథమిక విద్య, మైసూరులో డిగ్రీ.. హైదరాబాద్‌లోని ‘హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ’లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. చాటింగ్‌ ద్వారా పరిచయం అయిన సోనాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికో బాబు ఉన్నాడు.

కత్తి మహేశ్‌ మరణవార్త విని షాక్‌ గురయ్యానని మంచు మనోజ్‌ ట్విటర్‌లో తెలిపారు. కత్తి మహేశ్‌ ప్రాణాలు కోల్పోయాడనే వార్త కలచివేసింది. కత్తి మహేశ్‌ కుటుంబానికి ప్రాగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేశ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని మంచు మనోజ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. టాక్సీవాలా ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌ కత్తి మహేశ్‌ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. మహేశ్‌ ఆత్మకు శాంతి కలగాలని ట్విటర్‌లో పేర్కొన్నారు.

తెలుగు చిత్ర సీమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత బీఏ రాజు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పలువురు సినీ ప్రముఖులు

హ్యపిడేస్‌ ఫేం ఆదర్శ్‌ బాలకృష్ణ కత్తి మహేశ్‌ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో కత్తి మహేశ్‌తో గడిచిన క్షణాలను గుర్తుకుతెచ్చుకున్నారు. కత్తి మహేశ్‌ అపారమైన జ్ఞానం, ఆసక్తికరమైన భావజాలం కలిగిన వ్యక్తి అని ఆదర్శ్‌ కొనియాడారు. మహేశ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కత్తి మహేశ్‌ మరణవార్త విని షాక్‌ గురయ్యానని నేచురల్‌ స్టార్‌ నాని ట్విటర్‌లో పేర్కొన్నారు.కత్తి మహేశ్‌ ఎల్లప్పుడూ తన రివ్యూలతో ప్రత్యేకమైన కంటెంట్‌ సినిమాలను ప్రోత్సహించే వారని నాని గుర్తుచేశారు. మహేశ్‌ కుటుంబానికి, స్నేహితులకు సానూభూతిని వ్యక్తపరిచారు.