Delhi High Court: మామ లైంగికంగా వేధించారని కోడలు క్రిమినల్ కేసు, ఈ ఆరోపణలు అత్యంత క్రూరమైనవని తెలిపిన ఢిల్లీ హైకోర్టు, పిటిషనర్ కేసును కొట్టివేసిన ధర్మాసనం
వైవాహిక బంధాలు ఇటీవలి కాలంలో చాలా విచ్చిన్నం అవుతున్నాయి. తమ జీవిత భాగస్వామిపై పెంచుకున్న అనుమానాలు కూడా ఈ బంధాన్ని బలహీనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక వ్యాఖ్యలు చేసింది.
New Delhi, Mar 24: వైవాహిక బంధాలు ఇటీవలి కాలంలో చాలా విచ్చిన్నం అవుతున్నాయి. తమ జీవిత భాగస్వామిపై పెంచుకున్న అనుమానాలు కూడా ఈ బంధాన్ని బలహీనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. దంపతుల్లో ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని రెండో వ్యక్తి ఆరోపించడం (False allegation of extramarital affair) వారి వ్యక్తిత్వంపై దాడి కిందకు వస్తుందని తెలిపింది.
పేరు ప్రతిష్ఠలతో పాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందని పేర్కొంది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పెళ్లిని ఒక పవిత్రమైన బంధంగా పరిరక్షించాలని తెలిపింది. జీవిత భాగస్వామిపై చేసే తప్పుడు ఆరోపణలు తీవ్ర మానసిక వేదనను కలిగిస్తాయని, అందువల్ల ఇలాంటి తప్పుడు ఆరోపణలను న్యాయస్థానాలు క్రూరమైనవిగా పరిగణించి, తగు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది.
ఓ కేసును విచారించిన సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... 2014 జూన్ లో దంపతులకు వివాహమయింది. అయితే తన మామగారు తనను లైంగికంగా వేధించారంటూ భార్య క్రిమినల్ కేసు పెట్టింది. ఇది తన భార్య తన పట్ల చేసిన క్రూరమైన చర్య అంటూ భర్త కోర్టులో విడాకుల కోసం అర్జీ పెట్టాడు. అన్ని ఆధారాలను పరిశీలించిన కుటుంబ కోర్టు... భర్తకు అనుకూలంగా 2019 జనవరిలో విడాకులను మంజూరు చేసింది. దీంతో ఫ్యామిలీ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో భార్య సవాల్ చేసింది.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించిందని చెప్పింది. మామగారి మీద నిరాధారమైన ఆరోపణలను చేయడం ద్వారా... మామ, భర్త పట్ల మానసిక వేదనకు భార్య పాల్పడిందని తెలిపింది. వారికి తీరని మనోవేదన కలిగించిన నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు సరైన నిర్ణయం తీసుకుందని చెప్పింది. తన ఆరోపణలను నిరూపించలేకపోయిందని ఆమె అప్పీలును కొట్టేసింది.
(The above story first appeared on LatestLY on Mar 24, 2022 03:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

