COVID19 in India: భారత్‌లో క్రమంగా పెరుగుతున్న ఆక్టివ్ కేసుల సంఖ్య, తగ్గుతున్న రికవరీ రేటు, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా  16,577 కేసులు నమోదు
COVID in India Representational Image (Photo Credits: IANS)

New Delhi, February 26: భారత్‌లో నిన్నటివరకు 1.37 శాతంగా ఉన్న కోవిడ్19 ఆక్టివ్ కేసులు శుక్రవారం ఉదయం నాటికి స్వల్పంగా 1.41 శాతానికి పెరిగింది. ఏదైమైనా గత కొంతకాలంగా తగ్గుతూ పోతున్న ఆక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు పెరగడం, అదే సమయంలో రికవరీ రేటు తగ్గిపోవడం చూస్తే దేశంలో  కోవిడ్ 19 సెకండ్ వేవ్ మొదలైందా అనే సంకేతాలను ఇస్తుంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 16,577 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మరోసారి కొత్తగా మరో 8 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఒక్కరోజులో 8,702 కొత్త కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1,10,63,491కు చేరింది. నిన్న ఒక్కరోజే 120  కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,56,825 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,179 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,07,50,680 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,55,986 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.17% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.41% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.42% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఇక ఫిబ్రవరి 25 వరకు దేశవ్యాప్తంగా 21,46,61,465 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 8,31,807 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి 34 లక్షల మంది వ్యాక్సిన్ పొందినట్లు అంచనా.  తాజా గణాంకాల ప్రకారం 1,34,72,643 మంది హెల్త్ కేర్ - ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోంది. మార్చి 1  నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, అలాగే 45 ఏళ్లు పైబడి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి కోవిడ్ నివారణ టీకాలు పంపిణీ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాయాత్తం అవుతోంది.