India's COVID Report: భారత్‌లో మళ్లీ కరోనా విజృంభన, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,327 కేసులు నమోదు, దేశంలోని 6 రాష్ట్రాల నుంచే 85 శాతం కొత్త కేసులు
Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, March 6: భారత్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తుంది, నిన్నటితో పోలిస్తే ఈరోజు సుమారు 2 వేల కేసులు పెరిగాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, హరియాణ, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రోజూవారి కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.  85 శాతం కొత్త కేసులు ఈ రాష్ట్రాల నుంచే ఉండగా వీటి తర్వాత కేరళ నుంచి కూడా ఎక్కువ కేసులు వస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 18,327 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 1,11,92,088కు చేరింది. నిన్న ఒక్కరోజే 108 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,57,656కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,234 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,08,54,128 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,80,304 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. భారతదేశంలో కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 1.61 శాతానికి పెరిగింది.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.98% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.61 % శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.41% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఇక మార్చి 5 వరకు దేశవ్యాప్తంగా 22,06,92,677 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,51,935 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి 90 లక్షల మంది వ్యాక్సిన్ పొందినట్లు అంచనా. తాజా గణాంకాల ప్రకారం 1,94,97,704 మంది పౌరులు టీకాలు  వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.