COVID19 in India: భారత్‌లో ఇప్పటివరకు 20 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ; దేశవ్యాప్తంగా కొత్తగా  2.11 లక్షల పాజిటివ్ కేసులు మరియు 3,847 కోవిడ్ మరణాలు నమోదు
Coronavirus Outbreak (Photo Credits: IANS)

New Delhi, May 27: భారత్‌లో సెకండ్ వేవ్ పరిస్థితులు మెల్లిమెల్లిగా అదుపులోకి వస్తున్నాయి. ప్రస్తుతం రోజూవారీ కోవిడ్ కేసుల సంఖ్య 2 లక్షలుగా నమోదవుతున్నాయి. అయితే దేశంలో నిన్నటికంటే ఈరోజు కోవిడ్ కేసులు స్వల్పంగా పెరగగా,  కోవిడ్ మరణాలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.  మరోవైపు కోవిడ్ నుంచి కోలుకునే వారి సంఖ్య స్థిరంగా మెరుగుపడుతోంది. తాజా నివేదిక ప్రకారం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 90 శాతానికి పెరగటం ఊరటనిస్తుంది. ఈ క్రమంలో దేశంలో కోవిడ్ ఆక్టివ్ కేసులు తగ్గుతూపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ మరియు కర్ఫ్యూ ఆంక్షలు అమలు పరచడం ఫలితాన్నిచ్చింది. లాక్డౌన్ అమలులో ఉన్న రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ రేటు కూడా గణనీయంగా తగ్గినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,11,298 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 చేరింది. నిన్న ఒక్కరోజే 3,847 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,15,235కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,83,135 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,46,33,951 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 24,19,907 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 90.01% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 8.84 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.12% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

మే 26 నాటికి దేశవ్యాప్తంగా 33,69,69,352 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 21,57,857 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 20 కోట్లు దాటింది. అంటే 130 రోజుల్లో భారత్ 20 కోట్ల వ్యాక్సిన్ డోసులను పౌరులకు పంపిణీ చేసింది. అమెరికా 124 రోజుల్లోనే తమ దేశంలో ఈ మార్కును దాటేసింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా  20,26,95,874 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 15,88 కోట్లు ఉండగా, సెకండ్ డోస్ తీసుకున్న వారి సంఖ్య కేవలం 4.36 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం.