COVID19 in India: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం, గడిచిన 24 గంటల్లో 72,330 పాజిటివ్ కేసులు నమోదు; దేశవ్యాప్తంగా నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన పౌరులకు వ్యాక్సినేషన్ ప్రారంభం
COVID-19 Vaccine (Photo Credits: Twitter)

New Delhi, April 1: భారత్‌లో కోవిడ్19 సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చింది. కేసుల సంఖ్య రోజుకి 10 వేల చొప్పున పెరుగుతూ ఏప్రిల్ నెల ప్రారంభమయ్యే నాటికి రోజూవారి పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలు దాటింది. రెండు మూడు వారాల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నాలుగు రేట్లు పెరిగాయి. ఒక్క మహారాష్ట్ర నుంచే 65 శాతం కేసులు నమోదవుతుండటం గమనార్హం, మిగితా రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకి గణనీయంగా పెరుగుతూపోతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఏప్రిల్ 1 నుంచి పలు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆంక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి.

మరోవైపు ఈరోజు నుంచే 45 సంవత్సరాల పైబడిన వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు. అర్హులైన వారు కోవిన్ వెబ్‌సైట్ ద్వారా రిజస్టర్ చేసుకోవచ్చు లేదా నేరుగా వెళ్లి టీకా పొందవచ్చు.  కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని కేంద్రం భావిస్తోంది.

గత 24 గంటల్లో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 72,330 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 35,544 కేసులు ఉన్నాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,21,665కు చేరింది. నిన్న ఒక్కరోజే 459 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,62,927 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40,382 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,14,74,683 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 5,84,055 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 94.11 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 4.55 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఇక మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 24,47,98,621 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,25,681 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 6.5 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 6,51,17,896 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.