India's COVID19 Update: భారత్‌లో కరోనా కల్లోలం, గడిచిన 24 గంటల్లో 81,466 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్క మహారాష్ట్ర నుంచే 43 వేలకు మించి నమోదైన కేసులు
COVID19 Outbreak in India. (Photo Credit: PTI)

New Delhi, April 2: భారత్‌లో కోవిడ్19 విజృంభన మరో స్థాయిలో కొనసాగుతోంది,  రోజుకి అదననంగా 10 వేల చొప్పున కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో రోజూవారి పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం 70 వేల మార్కు దాటగా, శుక్రవారం 80 వేలు దాటి కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఏప్రిల్ 15- 20 మధ్య కోవిడ్ తీవ్రత మరింత ఉధృతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కాలంలో ఇండియాలో కనీసం 10 లక్షల కోవిడ్ కేసులు నమోదు కావొచ్చని వారి అంచనా.

మహారాష్ట్రలో మళ్లీ గత పరిస్థితులే నెలకొన్నాయి. దేశంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో సుమారు 50-65 శాతం కేసులు ఆ రాష్ట్రం నుంచే నమోదవుతుండటం గమనార్హం. ఇప్పుడు దేశంలో లాక్డౌన్ లేకపోవడం మరియు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోవడంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్కెట్ యార్డులలో, సినిమా థియేటర్లు, పార్కులు, రెస్టారెంట్లు, బార్లు మొదలగు చోట్ల జనం కుప్పలుతెప్పలుగా దర్శనం ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా, మాస్కులు ధరించమని, భౌతిక దూరం పాటించమిని సూచిస్తున్నా ప్రజలు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. దీంతో రోజురోజుకి కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

గత 24 గంటల్లో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 81,466 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 43,183 కేసులు ఉన్నాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,03,131కు చేరింది. నిన్న ఒక్కరోజే 469 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,63,396కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,356 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,15,25,039 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,14,696 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 93.68 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 5.00 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.33% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఇక ఏప్రిల్ 1 వరకు దేశవ్యాప్తంగా  24,59,12,587  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,13,966 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 6.8 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 6,87,89,138 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.