COVID19 in India: భారత్‌లో 21 లక్షల 50 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీగా 64,399 కేసులు నమోదు, 43 వేలు దాటిన కరోనా మరణాలు
COVID19 Outbreak in India | Photo: ANI

New Delhi, August 9: కరోనావైరస్ కల్లోలం కొనసాగుతోంది. ప్రతిరోజు దేశంలో వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులను చూస్తే ఈ వైరస్ వ్యాప్తి ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు లేవనే అనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 64,399 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో  మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 21,53,010కు చేరింది. నిన్న ఒక్కరోజే 861 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 43,379 కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో  దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 53,879 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,480,884 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 628,747 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, దిల్లీ లాంటి రాష్ట్రాలలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే నమోదైన 12,822 పాజిటివ్ కేసులతో మహారాష్ట్రలో కొవిడ్ బాధితుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం ఉదయం నాటికి మహారాష్ట్రలో కొవిడ్ కేసుల సంఖ్య 5,03,084కు చేరగా కొత్తగా మరో 275 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో ఇక్కడ కరోనా మరణాల సంఖ్య 17,367కు పెరిగింది.

ఇక మహారాష్ట్ర తర్వాత 285,024 పాజిటివ్ కేసులతో తమిళనాడు రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 5880 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో నిన్న మరో 10,080 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 2,17,040కు చేరుకొని తమిళనాడును వెనక్కి నెట్టేలా కనిపిస్తోంది.