Alla Ramakrishna Reddy: అది అక్రమ నిర్మాణం, టీడీపీ ఆఫీసును కూల్చేయాల్సిందే, ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు
Mangalagiri MLA Alla Ramakrishna Reddy moves the High Court on New TDP office constructed in Mangalagiri (Photo-Facebook)

Amaravathi, December 7: గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మితమైన టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణం అక్రమమని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Manglagiri MLA Alla Ramakrishna Reddy) ఆరోపించారు. టీడీపీ కార్యాలయాన్ని (TDP Office) కూల్చివేయాలంటూ ఆయన ఏపీ హైకోర్టు(AP High Court)లో పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయన గురువారం(డిసెంబర్ 5, 2019) ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు.

ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకుకు చెందిన సర్వే నెంబరు 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్న ఆళ్ల... ఇది అక్రమమని అన్నారు. ఇందులో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, టీడీపీ అధ్యక్షుడు తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై సోమవారం విచారణ జరిగే ఉందని తెలుస్తోంది.

వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూముల్ని ఇతరాలకు కేటాయించడం పర్యావరణ చట్టాలకు విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని ఎమ్మెల్యే ఆళ్ల తన పిటిషన్‌లో వివరించారు. ఈ వ్యవహారంలో అనేక చట్ట ఉల్లంఘనలు ఉన్నందున గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయడంతో పాటు అక్రమంగా కట్టిన టీడీపీ భవనాన్ని కూల్చివేసి, తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకునేలా అధికారులను ఆదేశించాలని హైకోర్టును కోరారు.

టీడీపీ ఆఫీసును ప్రారంభించిన అధినేత చంద్రబాబు

కాగా అత్మకూరు పరిధిలో టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని(New TDP office constructed at Atmakur) పార్టీ అధినేత చంద్రబాబు (Chandra babu), లోకేష్ (Lokesh) దంపతులు ప్రారంభించారు. కార్యాలయం ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు చేపట్టి పార్టీ జెండాను చంద్రబాబు ఎగురవేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన కొద్దిరోజులకే కృష్ణా కరకట్టపై గత ప్రభుత్వ నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేసిన విషయం తెలిసిందే. అదే ప్రజావేదికలో కలెక్టర్ల తొలి సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ఇది అక్రమ కట్టడమని.. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజావేదికను తక్షణమే కూల్చివేయాలని ఆదేశించి తన వైఖరిని స్పష్టం చేశారు.