Devineni Uma Arrest: దేవినేని ఉమపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు, ముందస్తు ప్లాన్‌లో భాగంగానే దేవినేని ఉమ అక్కడికి వెళ్లారు, మీడియాతో ఏలూరు రేంజ్ డిఐజి మోహన రావు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌
devineni Uma (Photo-Facebook)

Amaravati, July 28: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గత రాత్రి అరెస్ట్ (Devineni Uma Arrest) చేసిన పోలీసులు తాజాగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతోపాటు 307 కింద హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. గత రాత్రి ఉమను అరెస్ట్ చేసి పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్ అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో పరిశీలనకు వెళ్లిన ఉమ తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారుపై దాడి జరిగింది.

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగు జగనన్న కాలనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ ప్రభుత్వం పేదలకు గడ్డమణుగులో ఇళ్ళ స్థలాలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా అక్కడ మెరకను చదును చేసే పనులు కొనసాగిస్తున్నారు. దేవినేని ఉమా అటవీ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ 50 మందికి పైగా తన అనుచరులతో ఇళ్ల స్థలాల వద్దకు దేవినేని ఉమ చేరుకున్నారు.దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ కొండూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఇరువర్గాలు స్టేషన్‌ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రూ. 20 వేల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ, ఆగస్టు 16న విద్యా కానుక, ఆగస్టు 10న నేతన్న నేస్తం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్

జీ.కొండూరులో అర్ధరాత్రి ఒంటిగంట దాకా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున గ్రామానికి తరలిరాగా పోలీసులకు ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు జి.కొండూరుకు చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కూడా ఈ ఘటనపై ఆరా తీశారు.

జీ.కొండూరు వివాదానికి మాజీ మంత్రి దేవినేని ఉమ‌ ప్రదాన కారణమని ఏలూరు రేంజ్ డిఐజి మోహన రావు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌లు తెలిపారు. దేవినేని ఉమ దురుద్దేశపూర్వకంగా.. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే జి.కొండూరు వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించినందున మాజీ మంత్రి దేవినేని ఉమపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసుని పూర్తి పారదర్శకంగా విచారణ చేస్తున్నామన్నారు. దేవినేని ఉమ‌పై పోలీసులకి ఫిర్యాదు కూడా అందిందన్నారు.