Vjy, Nov 29: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ పర్యటనల్లో నేరుగా పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ప్రతీ బుధ,గురువారాల్లో పూర్తిగా వాళ్లతోనే ఉండనున్నారు.
వాళ్ల నుంచి పార్టీ బలోపేతానికి సలహాలు తీసుకోనున్నారు. సంక్రాంతి తర్వాత ఈ పర్యటనలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇందుకోసం రోజూ 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలాగే ప్రతీ పార్లమెంట్ నియోజక వర్గంలో సమీక్షలు జరపనున్నారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు సంబంధించి పార్టీ ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
నేను మీ అందరికీ కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. బెయిల్ కూడా ఇవ్వలేదు. అయినా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యాను.
ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తాను. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటాను. మమేకం అవుతాను. పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తాను. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
జనవరిలోగా పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలి. జిల్లాస్ధాయి నుంచి మండల స్ధాయి వరకు పూర్తవ్వాలి. ఆ తర్వాత బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు జరగాలి. గ్రామస్ధాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఫేస్ బుక్, ఇన్‌స్టా, వాట్సప్ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలి. ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నించాలి. సూపర్ సిక్స్ ఏమైంది? ఏమైంది సూపర్ సెవన్? అని నిలదీయాలని తెలిపారు.