Justice For Disha: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్, ఏర్పాట్లు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, వీలైనంత త్వరలో నిందితులకు శిక్ష ఖరారు
హైకోర్ట్ ఆమోదం నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఇది ఏర్పాటైన తర్వాత రోజూవారీ పద్ధతిలో ప్రత్యేకంగా ఈ కేసు విచారణను పూర్తి చేస్తారు, నిందితులకు శిక్షలు ఖరారు కాగానే తీర్పుకనుగుణంగా శిక్షలు అమలు చేయడం జరుగుతుంది....
Hyderabad, December 4: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అత్యాచారం, హత్యకు గురికాబడ్డ దిశ (Disha) కేసులో ఇక విచారణ వేగవంతం కానుంది. ఈ కేసుకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి కొంత ఊరట కలిగించే ప్రయత్నంలో భాగంగా కేసు విచారణ వేగంగా పూర్తిచేసి నిందితులకు శిక్షలు ఖరారు చేసేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు (Fast-track court) ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర హైకోర్ట్ (High Court) బుధవారం ఆమోదం తెలిపింది.
హైకోర్ట్ ఆమోదం నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఇది ఏర్పాటైన తర్వాత రోజూవారీ పద్ధతిలో ప్రత్యేకంగా ఈ కేసు విచారణను చేపట్టి, తక్కువ కాలంలో విచారణ పూర్తిచేస్తారు. నిందితులకు శిక్షలు ఖరారు కాగానే తీర్పుకనుగుణంగా శిక్షలు అమలు చేయడం జరుగుతుంది.
దిశ హత్యాచారం ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా తీవ్రఆగ్రహావేశాలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసును సత్వరమే విచారించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
గతంలో వరంగల్ లో ఓ చిన్నారి ఘటన విషయంలో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కేసును సిఫారసు చేయడంతో 56 రోజుల్లోనే ఆ కేసు విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. ఈ క్రమంలో ఇప్పుడు దిశ కేసు ఎన్ని రోజుల్లో విచారణ పూర్తి చేస్తారో, ఎలాంటి శిక్షలు విధిస్తారనేదానిపై ఉత్కంఠత నెలకొంది.
(The above story first appeared on LatestLY on Dec 04, 2019 04:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

