Hyderabad Metro Phase II: ఊపందుకున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు, మెట్రో పాసులు ఇవ్వలేము, నిబంధనల ప్రకారమే టికెట్ల ధరలు, మీడియాతో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి
Hyderabad Metro Rail Focus now on Phase II (Photo-wikimedia commons)

Hyderabad, Febuary 26: మెట్రో రెండో దశలో (Hyderabad Metro Phase II) భాగంగా మరో 3 మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు డీపీఆర్‌ (DPR) సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి (N V S Reddy) తెలిపారు. రెండో దశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) వరకు (31కి.మీ) లక్డీకపూల్ నుంచి ఆర్జీఐఏ, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు కొత్త మార్గాలలో మెట్రో రైలు నడిపేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రయాణికులకు శుభవార్త

అలాగే అత్యంత కీలకమైన ఓల్డ్ సిటీలో మరో 5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఈ పనులు ప్రారంభిస్తామన్నారు.

మొత్తం ఫేజ్‌– 2లో 62 కి.మీ. మెట్రో రైల్‌ మార్గం నిర్మించేందుకు డీపీఆర్‌ తయారు చేసినట్లు చెప్పారు. నగరంలోని (Hyderabad) చాలా ప్రాంతాలవాసులు మెట్రో రైల్‌ విస్తరణ గురించి విజ్ఞప్తులు చేస్తున్నారని చెప్పారు. ఇందులో ఎల్‌బీనగర్‌– హయత్‌నగర్, తార్నాక– మెట్టుగూడ– ఈసీఐఎల్‌–మల్కాజ్‌గిరి, ప్యారడైజ్‌– మేడ్చల్‌ వరకు విస్తరించాలనే విజ్ఞప్తులు వస్తున్నాయని అన్నారు. ఫేజ్‌–1లో ప్రతి కిలోమీటర్‌ మెట్రో ఏర్పాటుకు రూ.230 కోట్లు ఖర్చు కాగా ఫేజ్‌–2లో రూ.300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు.

జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి

ప్రస్తుతం 55 రైళ్లను నడుపుతున్నామని, మరో రెండు రైళ్లను పరీక్షిస్తున్నామని 10 రోజుల్లో వాటిని కూడా అందుబాటులోకి తీసుకుని వస్తామని వివరించారు. గతంలో రోజూ 700 నుంచి 800 ట్రిప్పులు తిప్పే వారమని ప్రస్తుతం అది వెయ్యి ట్రిప్పులకు పెరిగిందన్నారు. ప్రతి రోజు నాలుగు లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారని అన్నారు.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు వల్ల మొత్తం రూ.40 కోట్ల ఆదాయం వస్తోందని, టికెట్ల ద్వారా రూ.30 కోట్లు, రియల్‌ ఎస్టేట్‌, ప్రకటనల ద్వారా రూ.10 కోట్ల ఆదాయం వస్తోందని వివరించారు. ఎల్‌ అండ్‌టీ ఖర్చు చేసిన మొత్తానికి ఏటా సుమారు రూ.1,300 కోట్ల వరకూ వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటోందని వివరించారు. ఈ అప్పుల భారం ఓ కొలిక్కి వచ్చేందుకు మరో 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుందని చెప్పారు.

హైదరాబాద్ మెట్రోలో ఉచిత వీడియో స్ట్రీమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ సదుపాయం

రియల్‌ ఎస్టేట్‌ పరంగా 1.85 కోట్ల చదరపు అడుగుల విస్తర్ణంలో వ్యాపార భవనాలను నిర్మించాలని, ఇప్పటి వరకు కేవలం 4 నాలుగు షాపింగ్ మాల్స్‌ నిర్మించామని చెప్పారు. రాయదుర్గంలో 15 ఎకరాల్లో ఐటీ కంపెనీల కోసం భవనాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. వీటన్నింటినీ పూర్తి చేసి అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందని తద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లాభాల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుమల తిరుపతి మెట్రో రైల్‌ కోసం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కోరిక మేరకు మూడు రోజుల పాటు ప్రాథమికంగా పరిశీలన మాత్రమే చేశామని ఎన్‌వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల మార్గంలో అత్యధిక మలుపుతో ఉన్న ఘాట్‌రోడ్డు ఉందని, అలాగే అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యం ఉండటంతో అన్నీ పరిశీలించాల్సి ఉంటుందన్నారు.

గతంలో రోప్‌వే నిర్మాణానికి ఆగమశాస్త్రం ఒప్పుకోలేదని, దీన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. శాస్త్రాలను, కాంటూర్స్‌ను అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అవన్నీ చూశాక ఒక పరిష్కార మార్గం కనుగొనాలని అన్నారు.

మెట్రో రైలు ప్రాజెక్టులో టికెట్‌ ధరలు నిబంధనల ప్రకారమే ఉన్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని మెట్రో రైలు చట్టం ప్రకారం ఛార్జీల నిర్ధారణ కమిటీ నిర్ణయించిన ధరలనే ప్రస్తుతం ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో నెలవారీ మంత్లీ పాసులు జారీ చేయడం సాధ్యం కాదని సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు.