Hyderabad, June 5: తెలంగాణలో శుక్రవారం మరో 143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 3290కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 2842 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఎప్పట్లాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనావైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే నగరంలో కరోనా కేసుల సంఖ్య 2 వేలు దాటింది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో కూడా అత్యధికంగా 116 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి 8, మహబూబ్ నగర్ నుంచి 5, వరంగల్ నుంచి 3, ఆదిలాబాద్, కరీంనగర్, మేడ్చల్, సంగారెడ్డి మరియు ఖమ్మం జిల్లాల నుంచి 2 చొప్పున కేసులు నమోదు కాగా, మంచిర్యాల నుంచి మరో పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది.
ఇటు కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూపోతోంది. శుక్రవారం మరో 8 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 113 కు పెరిగింది.
ఇదిలా ఉంటే ఈరోజు మరో 40 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1587 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1550 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
Telangana's #COVID19 Report:
ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల్లో 206మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది. అలాగే ఇతర దేశాల నుంచి స్వదేశానికి చేరుకుని ప్రస్తుతం క్వారైంటైన్లో ఉన్నవారిలో 212 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరితో పాటు మరో 30 మంది విదేశీయులు కూడా పాజిటివ్ వచ్చిన వారి జాబితాలో ఉన్నారు. మొత్తంగా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 448 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.