Hyderabad, June 16: తెలంగాణలో మంగళవారం మరో 213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 5,406 కు చేరుకుంది. ఇందుకోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 1251 మంది నామూనాలను పరిశీలించగా వైద్య పరీక్షల్లో 213 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మిగిలిన 1038 సాంపుల్స్ నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇక ఈరోజు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 165 కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి నుంచి 16, మెదక్ నుంచి 13, కరీంనగర్ నుంచి 6, మేడ్చల్ నుంచి 3, నిజామాబాద్, సంగారెడ్డిల నుంచి 2 చొప్పున అలాగే కామారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి, పెద్దపల్లి , ఆసిఫాబాద్ మరియు జనగాం జిల్లాల నుంచి ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
మంగళవారం మరో నలుగురు కోవిడ్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 191 కు పెరిగింది.
ఇదిలా ఉంటే, ఈరోజు మరో 261 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,027 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,188 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
తొలిసారిగా తెలంగాణ సర్కార్ ఒకరోజులో ఎన్ని టెస్టులు నిర్వహించారనేది వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు 44,431 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.