Hyderabad, June 2: తెలంగాణలో మంగళవారం కొత్తగా మరో 99 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 87 కేసులు రాష్ట్రం పరిధిలోనే నమోదైనవి కాగా, వలస కార్మికుల్లో మరో 12 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక ఈ వలస కార్మికులు మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కేసులను మినహాయిస్తే, రాష్ట్రీయంగానే నమోదైన మొత్తం COVID-19 కేసుల సంఖ్య 2891 చేరుకుంది. ఈరోజు వచ్చిన 87 లోకల్ కేసుల్లో అత్యధికంగా 70 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోవే కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 7, మేడ్చల్ నుంచి 3, నల్గొండ నుంచి 2, సంగారెడ్డి, సిద్ధిపేట, జగిత్యాల, మంచిర్యాల మరియు మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
మంగళవారం మరో 4 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 92కు పెరిగింది. ఇదిలా ఉంటే ఈరోజు మరో 35 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1526 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1273 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
Telangana's #COVID19 Report:
ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికుల్లో 204 మందికి కరోనా సోకినట్లు నిర్ధారింపబడింది. అలాగే ఇతర దేశాల నుంచి స్వదేశానికి చేరుకుని ప్రస్తుతం క్వారైంటైన్లో ఉన్నవారిలో 212 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరితో పాటు మరో 30 మంది విదేశీయులు కూడా పాజిటివ్ వచ్చిన వారి జాబితాలో ఉన్నారు. మొత్తంగా ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 446 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది