Telangana's COVID Report: తెలంగాణలో భారీగా పాజిటివ్ కేసులు, ఒక్కరోజు లోనే అత్యధికంగా 253 మందికి కోవిడ్ నిర్ధారణ, రాష్ట్రంలో 4737కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య
COVID 19 Testing (Photo Credits: Pixabay)

Hyderabad, June 13: తెలంగాణలో శనివారం  మరో  253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.  తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 4,737 కు చేరుకుంది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల వారివి మినహాయించి, కేవలం తెలంగాణ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 4,288 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

హైదరాబాద్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 179  కేసులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి.  ఆ తరువాత సంగారెడ్డి నుంచి ఇటీవల కాలంలోనే అత్యధికంగా 24 కేసులు ఈరోజు నమోదయ్యాయి, మేడ్చల్ నుంచి 14, రంగారెడ్డి 11,   మహబూబ్ నగర్ 4, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ములుగు, కరీంనగర్, నల్గొండ, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల నుంచి 2 చొప్పున అలాగే సిద్ధిపేట, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, కామారెడ్డి మరియు జగిత్యాల జిల్లాల నుంచి ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నిర్ధారణ అయ్యాయి.

శుక్రవారం మరో 8 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 182 కు పెరిగింది.

Telangana's #COVID19  Report:

 

Status of positive cases of #COVID19 in Telangana

 

ఇదిలా ఉంటే ఈరోజు మరో 74 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,352 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,203 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

శనివారం నాటికి  దేశవ్యాప్తంగా అత్యధికంగా 11,458 కరోనావైరస్ కేసులను నమోదు అయ్యాయి, దేశంలోని మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 3,08,993 దాటిపోయింది. ఇటు మరణాల సంఖ్య కూడా సుమారు 9 వేల వరకు ఉంది. అత్యధిక కరోనా వైరస్ కేసులు ఉన్న ప్రపంచ దేశాలలో భారత ర్యాంకు 4వ స్థానంలోకి రావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సీనియర్ మంత్రులు మరియు సంబంధిత శాఖల అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో లాక్డౌన్ కి సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.