Dhaka, August 5: బంగ్లాదేశ్ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా వార్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిరసనకారులు హింసామార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపిన ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్
బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ భారత పౌరులను భారత రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. దేశంలో ఉన్న విద్యార్థులు సహా భారతీయ పౌరులు తమతో సంప్రదిస్తూ ఉండాలని సిల్హట్‌లోని అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందుకు సంబంధించి స్థానిక కార్యాలయ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.
ప్రస్తుత సమయంలో బంగ్లాదేశ్‌కు భారతీయులు ఎవరూ వెళ్లవద్దని తెలిపింది. అత్యవసర సాయం కోసం భారత హైకమిషన్ ఫోన్ నంబర్లను +8801958383679 +8801958383680 +8801937400591 విడుదల చేసింది. బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది.