Tata Stocks: మళ్ళీ టాటా గ్రూప్‌లో ముదిరిన విభేదాలు.. కంపెనీ షేర్లు రూ.26,500 కోట్లకు పైగా పతనం.. అసలు టాటా కంపెనీలో ఏం జరుగుతోంది..

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌లో మళ్ళీ నాయకత్వ వివాదం రాజుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంతో పాటు కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే ప్రతిపాదనలు టాటా గ్రూప్‌లో తీవ్ర విభేదాలకు దారితీశాయి.

Tata Stocks: మళ్ళీ టాటా గ్రూప్‌లో ముదిరిన విభేదాలు.. కంపెనీ షేర్లు రూ.26,500 కోట్లకు పైగా పతనం.. అసలు టాటా కంపెనీలో ఏం జరుగుతోంది..
Tata Sons Re-Appoints N Chandrasekaran as Executive Chairman for Another 5-Year Term (File Image)

Tata Stocks: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌లో మళ్ళీ నాయకత్వ వివాదం రాజుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంతో పాటు కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే ప్రతిపాదనలు టాటా గ్రూప్‌లో తీవ్ర విభేదాలకు దారితీశాయి. గ్రూప్‌లో అత్యంత కీలకమైన టాటా సన్స్ బోర్డు, టాటా ట్రస్ట్స్ మధ్య తలెత్తిన ఈ అంతర్గత విభేదాల వార్తలు వెలువడటంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లలో టాటా గ్రూప్ షేర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా, చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓటు వేయడమే కాకుండా ఈ నియామకం ‘చట్టవిరుద్ధం’ అని పేర్కొనడం కార్పొరేట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రశేఖరన్ నాయకత్వంలో గ్రూప్ సాధించిన పురోగతిపై ఒకవైపు బోర్డు మెజారిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఎయిరిండియా, టాటా డిజిటల్ వంటి ప్రధాన వ్యాపారాల్లో మూలధన కేటాయింపులు, పనితీరుపై నోయెల్ టాటా తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బోర్డులో తనకున్న ప్రత్యేక వీటో అధికారంతో ఈ నిర్ణయాలను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, మెజారిటీ మద్దతుతో తీర్మానాలు నెగ్గడం వివాదాన్ని మరింత రాజేసింది.

టాటా సన్స్ బోర్డు కీలక నిర్ణయం..మరో 5 ఏళ్ల పాటు చంద్రశేఖరన్ కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్..

ఈ పరిణామాలు నేరుగా షేర్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపాయి. ముఖ్యంగా టాటా కెమికల్స్ షేరు ఏకంగా 7.6 శాతం పడిపోగా, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా ఇన్వెస్ట్‌మెంట్, టాటా టెక్నాలజీస్ వంటి కీలక కంపెనీల షేర్లు కూడా 3 నుంచి 8 శాతం వరకు క్షీణించాయి. దీంతో ఒక్కరోజే టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో సుమారు 3.2 బిలియన్ డాలర్లు (రూ.26,500 కోట్లకు పైగా) మేర పతనం నమోదైంది. గ్రూప్‌లో పాలనాపరమైన అనిశ్చితి, భవిష్యత్ వ్యూహాలపై విభేదాలు బయటపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమై అమ్మకాలకు దిగడమే ఈ పతనానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరొకవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 'అప్పర్ లేయర్' ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల ప్రకారం టాటా సన్స్ స్టాక్ మార్కెట్లో తప్పనిసరిగా లిస్ట్ కావాల్సి ఉంది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు లిస్టింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని బోర్డు భావిస్తుండగా, టాటా ట్రస్ట్స్ మాత్రం కంపెనీ లిస్టింగ్‌ను కూడా వ్యతిరేకిస్తోంది. ఇటీవల కోరం లేని కారణంగా టాటా సన్స్ చరిత్రలోనే తొలిసారిగా వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వాయిదా పడటం, దానివెంటే ఈ నాయకత్వ పోరు రచ్చకెక్కడం గ్రూప్ అంతర్గత మార్పులకు అద్దం పడుతోంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న ఈ నష్టాలు తక్షణ ప్రతిస్పందన మాత్రమేనని, రాబోయే షేర్‌హోల్డర్ల సమావేశంలో ఈ అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే మార్కెట్ మళ్ళీ స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 18, 2026 12:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).