Polavaram Hydro Power Project: పోలవరం జిల్లాకు మరో భారీ ప్రాజెక్ట్.. నవంబర్‌లో అందుబాటులోకి ఏపీ రెండో అతిపెద్ద హైడ్రో ప్లాంట్
ఆంధ్రప్రదేశ్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలక ముందడుగు పడుతోంది. పోలవరం జిల్లాలోని సిలేరు కాంప్లెక్స్‌లో ఉన్న పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. యూనిట్లు 5, 6 నిర్మాణం పూర్తయితే ఈ కేంద్రం రాష్ట్రంలో రెండో అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా అవతరించనుంది
Polavaram Hydro Power Project: ఆంధ్రప్రదేశ్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలక ముందడుగు పడుతోంది. పోలవరం జిల్లాలోని సిలేరు కాంప్లెక్స్‌లో ఉన్న పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. యూనిట్లు 5, 6 నిర్మాణం పూర్తయితే ఈ కేంద్రం రాష్ట్రంలో రెండో అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా అవతరించనుంది.
ప్రస్తుతం పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి 460 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. కొత్తగా రెండు 115 మెగావాట్ల యూనిట్లను ఏర్పాటు చేయడంతో మొత్తం సామర్థ్యం 690 మెగావాట్లకు చేరనుంది. దీంతో ప్రస్తుతం 770 మెగావాట్ల సామర్థ్యంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం తర్వాత పొల్లూరు రెండో స్థానంలో నిలవనుంది.
కొత్త EPFO పోర్టల్‌లో 8 కీలక సేవలు.. UAN యాక్టివేషన్ నుంచి PF విత్‌డ్రా వరకు ఇవే
యూనిట్లు 5, 6 నిర్మాణానికి ప్రభుత్వం రూ.536 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను ఈ ఏడాది నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. వాల్వ్ హౌస్ నుంచి కొత్త యూనిట్ల వరకు పెన్‌స్టాక్ పైప్‌లైన్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం యూనిట్-5లో రోటర్ ఏర్పాటు పనులు జరుగుతుండగా, యూనిట్-6లో స్టేటర్ ఇప్పటికే అమర్చారు. మిగిలిన పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.
పొల్లూరు కేంద్రంలో ఆరు జనరేటింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన దాదాపు 55 ఏళ్ల క్రితమే రూపొందినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆరు 115 మెగావాట్ల యూనిట్లకు అనుగుణంగానే ప్రాజెక్టును రూపొందించారు. అయితే డోంకరాయి పవర్ కెనాల్‌లో నీటి లభ్యత, నీటిమట్టాలు అనుకూలంగా లేకపోవడంతో తొలుత నాలుగు యూనిట్లను మాత్రమే నిర్మించారు. స్థానిక అధికారులు చేసిన ప్రతిపాదనల నేపథ్యంలో ప్రభుత్వం 2020లో రెండో దశ విస్తరణకు ఆమోదం తెలిపింది. అనంతరం యూనిట్లు 5, 6 నిర్మాణానికి నిధులు కేటాయించారు.
పొల్లూరు కేంద్రం విస్తరణ పూర్తయితే అదనంగా 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రాష్ట్రానికి అందుబాటులోకి వస్తుంది. జలవిద్యుత్ ప్రాజెక్టుల ప్రత్యేకత అయిన వేగవంతమైన విద్యుత్ ఉత్పత్తి, గ్రిడ్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో ఇది రాష్ట్రానికి ఉపయోగపడనుంది. ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మి ప్రాజెక్టు పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైడల్ డైరెక్టర్ సుజయ్ కుమార్ కూడా పనులను పర్యవేక్షిస్తున్నారు.
నిర్ణీత గడువులో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ కె. వెంకట రాజారావు తెలిపారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం విస్తరణ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
(The above story first appeared on LatestLY on Aug 26, 2026 04:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

