Heavy Rain in Hyderabad (Photo-PTI)

Weather Alert: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. కార్యాలయాల పనివేళలు ముగిసే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో ఐటీ కారిడార్‌ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మైత్రివనం, కూకట్‌పల్లి, మూసాపేట్, ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కాప్రా, మలక్‌పేట, నాచారం తదితర ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలకు అత్యవసర సూచనలు జారీ చేశారు. వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రయాణాలు కష్టతరంగా మారినందున అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, తప్పనిసరైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. జలమయమైన రోడ్లపై వాహనాలను ముందుకు తీసుకెళ్లే ప్రమాదకర ప్రయోగాలు చేయవద్దని, పోలీసులు, డీఆర్‌ఎఫ్ (DRF) సిబ్బంది ఇచ్చే సూచనలను పాటిస్తూ అదనపు సమయాన్ని కేటాయించుకుని ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.

వర్షాలు కురిసే అవకాశం.. 27 జులై 2026 సోమవారం ఉష్ణోగ్రత 29°Cకి చేరే అవకాశం

మరోవైపు నగరంలో సహాయక చర్యలను జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు వేగవంతం చేశాయి. రహదారులపై నిలిచిన నీటిని తొలగించేందుకు ప్రత్యేక సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రాఫిక్ పోలీసులు ప్రధాన జంక్షన్ల వద్ద విధులు నిర్వహిస్తూ రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. నగర ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా లేదా అత్యవసర సహాయం కావలసి వచ్చినా వెంటనే 'డయల్ 100' లేదా '112' సంఖ్యలకు కాల్ చేయవచ్చని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే జిహెచ్ఎంసి కంట్రోల్ రూమ్ ద్వారా సహాయక బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. బుధవారం నాటికి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల సహా మొత్తం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే గురువారం పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ములుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మంగళవారం సాయంత్రం వేళ రాజధాని హైదరాబాద్‌లో పడిన కుండపోత వానకు నగరం తడిసిముద్దయింది. సాయంత్రం 6 నుంచి 8 గంటల సమయంలో కురిసిన వర్షం వల్ల ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముషీరాబాద్, యూసుఫ్‌గూడ, షేక్‌పేట్, ఉప్పల్ ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో నగర రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.

పరిస్థితి తీవ్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలను రంగంలోకి దించారు. హైదరాబాద్ నగరంలో ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొనకుండా జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ మరియు పోలీస్ యంత్రాంగాలు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.