Emergency Landing Facilities: భారతదేశంలోనే తొలి అత్యవసర ల్యాండింగ్ 'రన్‌వే'గా NH 925A , దేశ భద్రతను బలోపేతం చేయడం కోసం మరొక 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాల అభివృద్ధి చేస్తామన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దేశ భద్రతను బలోపేతం చేసేందుకు 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు...
New Delhi, September 10: దేశ భద్రతను బలోపేతం చేసేందుకు 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రాజస్థాన్‌లోని జాతీయ హైవే 925ఎపై అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని రక్షణ మంత్రి రాజా్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రారంభించారు. బాడ్మేర్ లోని జాతీయ రహదారిపై వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్స్, ఇతర విమానాలు అత్యవసరంగా దిగేందుకు మూడున్నర కిలోమీటర్ల మేర ఈ ఎయిర్ స్ట్రిప్స్ నిర్మించారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళాధిపతి ఎయిర్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియాతో కలిసి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, గడ్కరీలు సాహసం చేశారు. వాయుసేనకు చెందిన సీ-130జే రవాణా విమానంలో ప్రయాణిస్తూ రాజస్థాన్ బాడ్మేర్ లోని జాతీయ రహదారి 925Aపై అత్యవసర ల్యాండింగ్ చేశారు.
అనంతరం నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, బాడ్మేర్ జాతీయ రహదారిని వాయుసేనకు చెందిన విమానాలను అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు వినియోగించే తొలి జాతీయ రహదారి అని తెలిపారు. సమీపంలో ఎయిర్ పోర్టులు లేనందున వాయుసేన విమానాలు అత్యవసర సమయంలో ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రోడ్డు నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. కీలక సరిహద్దులకు వ్యూహాత్మక భద్రత కల్పించడం ద్వారా దేశ భద్రతను కాపాడడాన్ని హైవే రన్ వేలు బలోపేతం చేస్తాయని గడ్కరీ పేర్కొన్నారు.
దేశంలోని 19 ప్రాంతాలలో రాజస్థాన్‌లోని ఫలోడీ - జైసాల్మేర్ రోడ్డు, బర్మేర్ - జైసాల్మేర్ రోడ్డు, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ - బలాసోర్ రోడ్డు, పన్‌గఢ్ లేదా కెకెడి సమీపంలోని ఖరగ్‌పూర్- కియోంజిహార్ రోడ్డు, తమిళనాడులోని చెన్నై, పుదుచ్చేరీ రోడ్డు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు - ఒంగోలు రోడ్డు, ఒంగోలు- చిలకలూరిపేట రోడ్డు, హర్యనాలో మండీ దబ్వాలీ - ఒడిషా రోడ్డు, పంజాబ్‌లో సంగ్రూర్ సమీపంలో, గుజరాత్‌లోని భుజ్- నాలియా రోడ్డు, సూరత్ - బరోడా రోడ్డు, జమ్ము కాశ్మీర్‌లో బనిహాల్- శ్రీనగర్ రోడ్డు, అస్సాంలో లేహ్ / న్యోమా ప్రాంతంలో, శివసాగర్ సమీపంలోని జోర్హాత్- బారాఘాట్ రోడ్డు, బగ్దోగ్రా- హషిమారా రోడ్డు, హషిమారా - తేజ్‌పూర్ మార్గం, హషిమారా- గువాహతి రోడ్డు అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ స్థాయి జాతీయ హైవేల నిర్మాణం రికార్డు వేగంతో కొనసాగుతోందని మంత్రి చెప్పారు. మన జాతీయ హైవేలు సైన్యానికి ఉపయోగపడతాయని, తద్వారా దేశం మరింత సురక్షితంగా ఉండటమే కాక, ఎప్పుడూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందన్నారు.
రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ వైమానిక విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం ఇలాంటి రహదారుల నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. యుద్ధ సమయాల్లోనే కాకుండా, ప్రతికూల సమయాల్లోనూ ఎయిర్ స్ట్రిప్ లు కీలక భూమిక పోషిస్తాయని తెలిపారు
ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షిఖావత్, కేంద్ర రక్షణ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 10, 2021 10:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

