Kerala HC on Property Ruling: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. భర్త పేరు కూడా ఉన్నా ఆస్తి భార్యదే.. తండ్రి డబ్బుతో కొన్న ఆస్తిపై భార్యకే పూర్తి హక్కని స్పష్టం..
ఉమ్మడి (జాయింట్) పేరుతో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ, ఆస్తి కొనుగోలుకు పూర్తి డబ్బును భార్య తండ్రే సమకూర్చినట్లు బ్యాంక్ ఆధారాలతో నిరూపితం కావడంతో, మలప్పురం జిల్లాలోని ఏడు సెంట్ల స్థలం, అందులోని ఇల్లు భార్యకే (రస్లిన్) చెందుతుందని కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
Kerala HC Property Ruling: ఉమ్మడి (జాయింట్) పేరుతో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ, ఆస్తి కొనుగోలుకు పూర్తి డబ్బును భార్య తండ్రే సమకూర్చినట్లు బ్యాంక్ ఆధారాలతో నిరూపితం కావడంతో, మలప్పురం జిల్లాలోని ఏడు సెంట్ల స్థలం, అందులోని ఇల్లు భార్యకే (రస్లిన్) చెందుతుందని కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉమ్మడి పేరున ఆస్తి రిజిస్టర్ అయినంత మాత్రాన భర్తకు అందులో స్వతంత్ర యాజమాన్య హక్కులు రావని ధర్మాసనం స్పష్టం చేసింది.
అంతేకాకుండా, ప్రస్తుతం అదే ఇంట్లో నివసిస్తున్న భర్త (కురుదన్‌కండీ షంషీర్) మూడు నెలల వ్యవధిలో ఆస్తిని పూర్తిగా ఖాళీ చేసి భార్యకు అప్పగించాలని జస్టిస్ సతీష్ నినన్, జస్టిస్ పి. కృష్ణ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. రస్లిన్, ఆమె భర్త షంషీర్ పేర్లపై 2015 నవంబర్ 9న ఏడు సెంట్ల భూమి, ఇంటిని కొనుగోలు చేశారు. తన కుమార్తె భవిష్యత్తు , కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె తండ్రే రూ. 30 లక్షల పూర్తి మొత్తాన్ని సమకూర్చారని భార్య తరఫున కోర్టులో వాదించారు. అయితే, ఈ కొనుగోలులో తన సొంత డబ్బు కూడా ఉందని భర్త వాదించినప్పటికీ, దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలను లేదా విదేశీ నిధుల లావాదేవీల పత్రాలను ఆయన కోర్టు ముందు ఉంచలేకపోయారు.
విచారణ సమయంలో భార్య తండ్రి సమర్పించిన బ్యాంక్ స్టేట్‌మెంట్ ఆధారాలు కేసును కీలక మలుపు తిప్పాయి. సేల్ డీడ్ జరిగిన రోజే ఆయన ఖాతా నుండి రూ. 25 లక్షలు డెబిట్ అయినట్లు బ్యాంక్ రికార్డులు స్పష్టంగా నిరూపించాయి. అంతేకాకుండా, ఆస్తికి సంబంధించిన అసలు టైటిల్ డీడ్‌లు (Original Documents) కూడా భార్య వద్దే ఉండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. భర్త చేసిన మౌఖిక వాదనలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
కుటుంబ వివాదాలను పరిష్కరించే క్రమంలో కేవలం సాంకేతిక అంశాలకే పరిమితం కాకుండా, ఆస్తికి అసలు నిధులు ఎవరు సమకూర్చారు, కొనుగోలు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి, , డాక్యుమెంట్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వాస్తవాలను చూడాలని హైకోర్టు వివరించింది. గతంలో మలప్పురం ఫ్యామిలీ కోర్టు భర్త రూ. 15 లక్షలు భార్యకు చెల్లించాలని ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ, ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కు భార్యకే ఉందంటూ స్పష్టమైన డిక్రీని జారీ చేసింది.
(The above story first appeared on LatestLY on Oct 01, 2026 05:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

