Jharkhand CM Hemant Soren: ఆ రాష్ట్ర సీఎం కుటుంబంలో 15 మందికి కరోనా పాజిటివ్, ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎంకు మాత్రం తేలిన నెగిటివ్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
రాంచీ, జనవరి 9: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్‌లో సైతం రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. పరీక్షల్లో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కోవిడ్ -19 పరీక్షలు చేసినట్లు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. వారిలో 24 మంది రిపోర్టులు శనివారం సాయంత్రం నాటికి వచ్చాయని.. వారిలో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వారిలో సీఎం భార్య కల్పనా సోరెన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ము ఉన్నారని కుమార్ తెలిపారు. నివాసంలో ఉన్న వారందరికీ తేలికపాటి కోవిడ్ -19 లక్షణాలు ఉన్నాయన్నారు. వారంతా ఇంట్లోనే సెల్ఫ్ క్వారెంటైన్ అయినట్లు తెలిపారు.
ఇదిలాఉంటే.. జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా సైతం కోవిడ్ బారిన పడ్డారు. శనివారం పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో ఆయన జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో ఐసోలేట్ అయ్యారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా అంతకుముందు కూడా ఆరోగ్యమంత్రి కరోనా సోకింది.
(The above story first appeared on LatestLY on Jan 09, 2022 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

