India's Weather Paradox: ఒక రాష్ట్రంలో వరదలు.. మరో రాష్ట్రంలో కరువు.. భారత్‌లో ఈ పరిస్థితి ఎందుకు?
భారత్‌లో ఒక రాష్ట్రం భారీ వర్షాలతో వరదలతో అతలాకుతలమవుతుంటే, మరో రాష్ట్రం తీవ్ర వర్షాభావం, నీటి కొరతతో ఇబ్బందులు పడటం తరచుగా కనిపించే పరిస్థితి.
భారత్‌లో ఒక రాష్ట్రం భారీ వర్షాలతో వరదలతో అతలాకుతలమవుతుంటే, మరో రాష్ట్రం తీవ్ర వర్షాభావం, నీటి కొరతతో ఇబ్బందులు పడటం తరచుగా కనిపించే పరిస్థితి. దీనికి ప్రధాన కారణాలు రుతుపవనాల అసమాన పంపిణీ, భౌగోళిక పరిస్థితులు, పశ్చిమ కనుమలు–హిమాలయాల ప్రభావం, ఎల్‌నినో–లా నినా వంటి వాతావరణ పరిణామాలు, అలాగే వాతావరణ మార్పులు (Climate Change). ఈ కారణాల వల్ల దేశవ్యాప్తంగా ఒకేసారి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడి, కొన్ని ప్రాంతాలు వరదలను, మరికొన్ని ప్రాంతాలు కరువును ఎదుర్కొంటున్నాయి.
దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ.. వాటి పురోగతి బలహీనంగా, అసమానంగా కొనసాగుతోంది. ఒకవైపు కొన్ని రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసిముద్దవుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎండలు, ఉక్కపోత పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ శాఖ (IMD), ఇస్రో సంయుక్తంగా పంపిన ఇన్శాట్-3డీఎస్ (INSAT-3DS) ఉపగ్రహ చిత్రాలు దేశంలో ఉన్న ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితిని స్పష్టంగా చూపుతున్నాయి.
వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. జూన్ 4 నుంచి ఇప్పటివరకు దేశంలో సాధారణంగా పడాల్సిన 446.3 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను కేవలం 395.5 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో జాతీయ స్థాయిలో 11 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పశ్చిమ, మధ్య భారతంలో దట్టమైన మేఘాలు ఉండగా, గంగా-సింధు మైదాన ప్రాంతాలైన ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో ఆకాశం నిర్మలంగా ఉంది.
గుజరాత్ పరిసర ప్రాంతాల్లో క్రియాశీలంగా ఉన్న వాతావరణ వ్యవస్థ వల్ల అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రుతుపవన ద్రోణి ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో (ఆగస్టు 3 నుంచి 5 మధ్య) ఉత్తరాది రాష్ట్రాల్లో 40 నుంచి 70 శాతం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.
మరోవైపు కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్ష తీవ్రత దృష్ట్యా సోమవారం (ఆగస్టు 3) కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, త్రిసూర్, ఇడుక్కి, కొట్టాయం, పత్తనంతిట్ట జిల్లాల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు స్థానిక యంత్రాంగం సెలవు ప్రకటించింది.
ఒకే సమయంలో లేదా ఒకే సీజన్‌లో ఒకే దేశంలోని ఒక రాష్ట్రంలో భారీ వరదలు, మరో రాష్ట్రంలో కరువు ఏర్పడటానికి భౌగోళిక, వాతావరణ, పర్యావరణ వ్యవస్థల్లోని వైవిధ్యాలే ప్రధాన కారణం. మనదేశంలో నైరుతి రుతుపవనాల సమయంలో ఇలాంటి విరుద్ధమైన పరిస్థితులు తరచూ కనిపిస్తుంటాయి. దేశంలోని విభిన్న భౌగోళిక నిర్మాణాలు వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
దానికి గల ముఖ్యమైన కారణాలు ఇవే:
Rain Shadow Regions: పశ్చిమ కనుమలు వంటి పర్వత శ్రేణులు తేమతో కూడిన గాలులను అడ్డుకుంటాయి. దీనివల్ల పర్వతాలకు గాలి వీచే వైపు ఉన్న తీర ప్రాంతాల్లో (ఉదాహరణకు కేరళ, కొంకణ్) కుండపోత వర్షాలు కురిసి వరదలు వస్తాయి. కానీ, అదే పర్వతాలకు అవతలి వైపు ఉన్న లోపలి ప్రాంతాలు (ఉదాహరణకు రాయలసీమ, ఉత్తర కర్ణాటక) వర్షచ్ఛాయ ప్రాంతాలుగా మారి నీటి ఎద్దడి లేదా కరువును ఎదుర్కొంటాయి.
2. రుతుపవనాల విలక్షణ ప్రవర్తన: రుతుపవనాల కదలికలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.రుతుపవన ద్రోణి రేఖ ఎటువైపు మొగ్గు చూపితే అక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఇది హిమాలయాల వైపు లేదా దక్షిణ దిశగా కదిలినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో వరదలు, మరికొన్ని రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఏర్పడి కరువు పరిస్థితులకు దారితీస్తుంది. సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉండే రాష్ట్రాలకు తేమగల గాలులు పుష్కలంగా అందుతాయి. అదే సమయంలో మైదాన ప్రాంతాలు లేదా తీరానికి దూరంగా ఉండే లోపలి రాష్ట్రాలకు చేరేసరికి గాలుల్లోని తేమ తగ్గిపోతుంది.
3. వాతావరణ మార్పులు: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల శైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు నెల రోజుల్లో పడాల్సిన వర్షం ఇప్పుడు కేవలం రెండు మూడు రోజుల్లోనే పడుతోంది. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో భూమి నీటిని పీల్చుకునే సమయం లేక వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాల మధ్య వ్యవధి (Rainy Gaps) వారాల తరబడి పెరిగిపోతోంది. దీనివల్ల భూమి ఎండిపోయి కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి.
4. ఎల్ నినో మరియు లా నినా: పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఉష్ణోగ్రత మార్పులు భారత రుతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.లా నినా సమయంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసి పలు రాష్ట్రాల్లో వరదలకు దారితీస్తే.. ఎల్ నినో సమయంలో వర్షపాతం తగ్గిపోయి చాలా ప్రాంతాల్లో వర్మాభావం లేదా కరువు ఏర్పడుతుంది.
5. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల స్థానాలు: బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు మరియు వాయుగుండాలు ప్రయాణించే మార్గంలో మాత్రమే విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఆ వాతావరణ వ్యవస్థల ప్రభావం లేని ప్రాంతాలు వర్షాలు లేక ఎండిపోతాయి.
6. మానవకారక, పర్యావరణ లోపాలు: చెట్లు నరికివేత వల్ల కొన్ని ప్రాంతాల్లో మేఘాలను ఆకర్షించే శక్తి తగ్గి వర్షాభావం ఏర్పడుతుంది. నదులు, చెరువుల ఆక్రమణ వల్ల వర్షం పడినప్పుడు నీరు ఇంకిపోకుండా, డ్రైనేజీ వ్యవస్థ లేక ఒక్కసారిగా వరదలుగా మారుతుంది.
ఈ విధంగా భౌగోళిక పరిమితులు, సముద్ర వాతావరణ ప్రభావాలు మరియు పర్యావరణ అసమతుల్యతల కలయిక వల్ల ఒకే సమయంలో ఒక రాష్ట్రం వరదల్లో మునిగితే, మరొక రాష్ట్రం చుక్క నీటి కోసం అల్లలాడే వింత పరిస్థితులు ఏర్పడతాయి.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

