Repo Rate Unchanged: రెపో రేటుపై RBI కీలక ప్రకటన.. లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. తటస్థ వైఖరి కొనసాగించడమే సరైన నిర్ణయమని తెలిపిన ఆర్బీఐ గవర్నర్..
RBI తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి తక్షణ వడ్డీ భారం పెరగకుండా ఊరట లభించింది.
Repo Rate Unchanged: భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన అనంతరం రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగిస్తునట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన నిర్ణయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం తటస్థ వైఖరి కొనసాగించడమే సరైన నిర్ణయమని ఎంపీసీ అభిప్రాయపడింది.
రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో హోమ్ లోన్లు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. బ్యాంకులు కూడా కొత్త రుణాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు 5.5 శాతం వద్ద కొనసాగుతున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది .
ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. అమెరికా విధిస్తున్న కొత్త సుంకాలు, ప్రపంచ వాణిజ్యంలోని అనిశ్చిత పరిస్థితులు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందన్నారు. ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, రూపాయి మారకపు విలువలో మార్పులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు ఆర్‌బీఐ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగానే ఉన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. దేశంలో వృద్ధి రేటు నిలకడగా కొనసాగడం, అనుకూల వర్షపాతం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. అయితే కొన్ని రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక వృద్ధి అంచనాల విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.
విశ్లేషకుల ప్రకారం.. గత జూన్‌లో ఆర్‌బీఐ 2026–27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, ఇంధన ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణాలని కేంద్ర బ్యాంకు అప్పుడే వివరించింది.
ప్రస్తుత నిర్ణయంతో రుణగ్రహీతలకు వెంటనే వడ్డీభారం పెరగకుండా ఊరట లభించనుంది. అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూ ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ సమతుల్య విధానాన్ని కొనసాగిస్తున్నట్లు ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.
(The above story first appeared on LatestLY on Aug 05, 2026 11:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

