'Greater Worry': గ్రేటర్ హైదరాబాద్‌పై కరోనా ఎఫెక్ట్, మరోసారి జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించే దిశగా అడుగులేస్తున్న తెలంగాణ సర్కార్, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా....

'Greater Worry': గ్రేటర్ హైదరాబాద్‌పై కరోనా ఎఫెక్ట్, మరోసారి జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించే దిశగా అడుగులేస్తున్న తెలంగాణ సర్కార్, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించిన సీఎం కేసీఆర్
COVID19 Lockdown in Telangana. | Photo: Twitter

Hyderabad, June 28:  తెలంగాణలో రోజురోజుకి కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు మరోసారి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. అయితే ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీ లేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని సీఎం స్పష్టం చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ మరియు పలువురు వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు.

‘‘దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నది. అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పాజిటివ్ గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా వేలాది బెడ్లు సిద్ధం చేశాం. సీరియస్ పేషంట్లకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. వ్యాధి లక్షణాలు లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం’’ అని ఈటల రాజేంధర్ వివరించారు.

ఈరోజు జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. జీహెచ్ఎంసి పరిధిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరోసారి 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలనేది వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని ఆరోగ్య మంత్రి ఈటల రాజేంధర్, సీఎంతో అన్నారు.

అందుకు సీఎం బదులిస్తూ  ‘‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేబినెట్ ను సమావేశ పరచాలి. అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ ను సమావేశ పరిచి, జీహెచ్ఎంసి పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

సీఎం మాటలను బట్టి చూస్తే వారం రోజుల్లో హైదరాబాద్ లో లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(The above story first appeared on LatestLY on Jun 28, 2020 07:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).