Telangana HC Cancels GO No 16: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు, ఇక నుంచి భర్తీ చేసే ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేయాలని ఆదేశాలు
తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను ధర్మాసనం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
Hyd, Nov 19: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను ధర్మాసనం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారంటూ పలువురు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టివేసింది.క్రమబద్దీకరణ (రెగ్యూలరైజ్) ద్వారా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న వారి తొలగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
విద్య, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేసింది. 2016లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జీవో 16ను సవాల్ చేస్తూ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ జీవోను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. విచారణ చేపట్టిన హైకోర్టు ఈ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులను తొలగించ వద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మిగిలిన ఖాళీలను చట్టప్రకారం భర్తీ చేయాలని సర్కార్‌కు ఆదేశించింది. పూర్తి వివరాలను ఆర్డర్ కాపీలో పేర్కొంటోమని వెల్లడించింది.ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ కాకుండా నోటిఫికేషన్ల ద్వారా చేయాలని కోర్టు తీర్పును వెలువరించింది.
రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు ఉన్నారు.
(The above story first appeared on LatestLY on Nov 19, 2024 06:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

