'COVID-19 Free Telangana': కొద్దిరోజుల్లోనే కరోనావైరస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. మే 07 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది: సీఎం కేసీఆర్

రాష్ట్రంలో అంతకుముందు ప్రకటించినట్లుగా మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని. ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని సీఎం అన్నారు. అన్ని మతాల వారు తమ ప్రార్థనా కార్యక్రమాలను, పండుగలను ఇండ్లలోనే చేసుకోవాలి. పాజిటివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ, ఆక్టివ్ కేసులు లేని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిస్తాం.....

'COVID-19 Free Telangana': కొద్దిరోజుల్లోనే కరోనావైరస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. మే 07 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుంది: సీఎం కేసీఆర్
Telangana CM KCR | File Photo

Hyderabad, April 28: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా యాక్టివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారుతున్నాయని సీఎం ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన వారిలో కూడా 97 శాతానికి పైగా పేషంట్లు కోలుకుని, డిశ్చార్జి అవుతుండడం మంచి పరిణామమన్నారు. వైరస్ వ్యాప్తి, ప్రభావం బాగా తగ్గుతున్నందున రాష్ట్రంలో కంటైన్మెంట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు ప్రకటించారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ సోకుతున్న వారి లింక్ మొత్తం గుర్తించి, అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ధోరణి (ట్రెండ్) చూస్తుంటే వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గిందన్నారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ పాజిటివ్ కేసులు వచ్చినా, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని సిఎం ప్రకటించారు.

సోమవారం ప్రధానమంత్రితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, హోం మంత్రి మహమూద్ అలీ, టిఆర్ఎస్ నేత కే. కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజిపి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కరోనా వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, సహాయ కార్యక్రమాలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలను సీఎం సుదీర్ఘంగా, లోతుగా సమీక్షించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు వైద్యశాఖ అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. సోమవారం 159 మందికి పరీక్షలు నిర్వహించగా, కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా సోమవారం 16 మంది డిశ్చార్జి అయినట్లు సీఎంకు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నట్లు చెప్పారు. మొదట విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా, తర్వాత మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ద్వారా వైరస్ మన రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలకు పాకిందన్నారు. అయితే పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ వారి లింకులన్నింటినీ దొరకబట్టి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

అయితే కొత్తగా వచ్చే పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన ప్రభుత్వం ఏమాత్రం ఉదాసీనంగా ఉండదు. ప్రతీక్షణం అప్రమత్తంగానే ఉంటామని సీఎం పేర్కొన్నారు. మళ్లీ ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చి, కేసుల సంఖ్య పెరిగినా సరే, సమర్థంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉంది. టెస్టింగ్ కిట్స్, పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు, ఇతర మాత్రలు, పరికరాలు, బెడ్సు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎన్ని కేసులొచ్చినా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చికిత్స చేయడానికి సర్వసన్నద్ధమయి ఉన్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అలాగే రాష్ట్రంలో అంతకుముందు ప్రకటించినట్లుగా మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని. ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలి,  అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని సీఎం అన్నారు. అన్ని మతాల వారు తమ ప్రార్థనా కార్యక్రమాలను, పండుగలను ఇండ్లలోనే చేసుకోవాలి. పాజిటివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ, ఆక్టివ్ కేసులు లేని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిస్తాం. కానీ కంటైన్మెంట్ కొనసాగుతున్న ప్రాంతాల్లో మాత్రం ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కోరారు.

(The above story first appeared on LatestLY on Apr 28, 2020 07:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).