India vs South Africa (Twitter)

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో జరుగుతున్న చివరి వన్డేలో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన పోరులో సౌతాఫ్రికా విక్టరీ సాధించి సిరీస్‌ని క్లీన్ స్వీప్‌ చేసింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెఎల్‌ రాహుల్ 9 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. కానీ శిఖర్ ధావన్, విరాట్‌ కోహ్లీ రెండో వికెట్‌కి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు బాధ్యతని భుజాలపై మోస్తూ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ 61 పరుగులు (73 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్‌) ఔటయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీ 65 పరుగులు (84 బంతుల్లో 5 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. వీరి తర్వాత మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులు పర్వాలేదనిపించినా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

చివరగా దీపక్‌ చాహర్ అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. బుమ్రాతో కలిసి ఎనిమిదో వికెట్‌కి 28 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంచుమించు భారత్‌ని విజయతీరాల వరకు చేర్చాడు. కానీ చివరలో ఔట్‌ కావడంతో మ్యాచ్‌ సౌతాఫ్రికా వైపు మళ్లింది. చివరి ఓవర్లో 7 బంతుల్లో 6 పరుగులు కావాలి. కానీ యజ్వేంద్ర చాహల్ అవుట్ కావడంతో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వయో 3, లుంగి ఎంగిడి 3, ప్రిటోరియా 2, కేశవ్ మహరాజ్ 1, సిసందా మగల 1 వికెట్‌ చొప్పున సాధించారు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన సౌతాఫ్రికా 287 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 3, దీపక్ చాహర్ 2, బుమ్రా 2, యజ్వేంద్ర చాహల్ 1 వికెట్ సాధించారు.