YS Sharmila: వైయ‌స్‌ ఇంటి ఆడపడుచులు ఇలా మాట్లాడడం బాధగా ఉంది..షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు..వైయ‌స్ఆర్‌ సోదరి విమల ఆగ్రహం
vimala {twitter}

వైయ‌స్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైయ‌స్‌ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని మ‌హానేత‌ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు ఏది మాట్లాడినా కరెక్ట్‌ అని ఎలా అనుకుంటున్నారని, వివేకా కేసులో నిత్యం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వైయ‌స్‌ విమల శనివారం మీడియాతో మాట్లాడారు.

మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు. మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారు. అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా?. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు?. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా?..

షర్మిలకు లీడర్‌షిప్‌ క్వాలిటీ ఎక్కడ ఉంది. అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు. అతనికి కుటుంబం ఉంది. ఏ పాపం చేయని నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడు. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు. హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది. శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి. వైయ‌స్ఆర్‌ ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు. వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు. వైయ‌స్ జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. వివేకం, వైయ‌స్ఆర్‌ ఇద్దరూ ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా ఉన్నారు. రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు.

మేనత్తగా చెప్తున్నా..

ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు. మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది. షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు. మా వైయ‌స్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు. మీరు చేసే పనుల పట్ల వైయ‌స్ఆర్‌ కూడా సంతోషంగా లేరు. వైయ‌స్ఆర్‌ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు

ప్రజలంతా సీఎం వైయ‌స్ జగన్‌కు అండగా ఉండాలి

వైయ‌స్ జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు. బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు. వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా. అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా మీరు ఇప్పటికైనా మారండి.. నోళ్లు మూసుకోండి. లేదంటే ఒకసారి షర్మిల, సునీత మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానంద రెడ్డి పనిచేశారు. ప్రజలంతా సీఎం వైయ‌స్ జగన్ కి అండగా ఉండాలి. మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి. అవినాష్ కు, వైయ‌స్ జగన్ కు ఓట్లు వేసి గెలిపించాలి. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ ను నమ్మవద్దు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాల‌ని విమల ఏపీ ప్రజల్ని కోరారు.