Andhra Pradesh Rains: తీరం దాటిన వాయుగుండం.. మరో 12 గంటల పాటు సముద్రం అల్లకల్లోలం.. ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం - పోలాకి మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం - పోలాకి మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విజృంభిస్తున్న ఈదురుగాలులు, ఆకస్మిక వరదల కారణంగా పలు జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోగా, రవాణా, విద్యుత్ వ్యవస్థలకు తీవ్ర విఘాతం కలిగింది.
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండి ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం రూరల్ పరిధిలోని తులసినగర్‌లో అత్యధికంగా 236 మి.మీ. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మధురవాడ (218 మి.మీ), ఎండాడ (210 మి.మీ), సీతమ్మధార (205 మి.మీ) ప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో విశాఖపట్నం నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
జిల్లాల వారీగా ప్రధాన నష్టాలు & పరిస్థితులు:
విశాఖపట్నం జిల్లా: విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని కస్తూరి నగర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. గోస్తనీ నది ఉద్ధృతికి భీమిలి మండలం టి.నగరపాలెం వద్ద మట్టికట్ట కొట్టుకుపోగా, పద్మనాభం మండలంలో పాఠశాల గోడపై చెట్టు కూలింది. నగరంలోని లాసన్స్‌బే కాలనీ, రామాటాకీస్ రోడ్డు పరిసరాల్లో 34 వృక్షాలు కూలిపోయాయి.
శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో సుమారు 12,022 హెక్టార్లలో వరి పంట నీటమునిగింది. వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో నీటిమట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. నందిగం మండలం కొత్త అగ్రహారం వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువపై వంతెన కూలిపోగా, 64 విద్యుత్ స్తంభాలు, 20 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలైన బోరుభద్ర, రామాయపట్నం తదితర గ్రామాల నుంచి 170 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా: పరదానిపుట్టు వాగు పొంగడంతో పెదబయలు - పాడేరు సరిహద్దులోని 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గూడెంకొత్తవీధి మండలంలో కల్వర్టు కొట్టుకుపోయి 23 గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.
విమాన రాకపోకలకు ఆటంకం: ప్రతికూల వాతావరణం, రన్‌వేలపై నీరు చేరడంతో విశాఖ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని హైదరాబాద్‌కు, అలాగే హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు & విద్యాసంస్థలకు సెలవులు:
తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దీని ప్రభావం భూభాగంపై మరో 12 గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.
అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రభావిత జిల్లాల్లో గురువారం కూడా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
(The above story first appeared on LatestLY on Sep 24, 2026 12:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

