AP Drought Mandals: ఈ ఏడాది కరువు జిల్లాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. 388 మండలాలు కరువుతో విలవిల.. రాయలసీమలోనే ఎక్కువ
AP Drought Mandals: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు కరువు మండలాలను ప్రకటించింది. నైరుతి రుతుపవన కాలం, ఖరీఫ్-2026 సీజన్‌లో నమోదైన వర్షపాత లోటును పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలో 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది.
AP Drought Mandals: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఎట్టకేలకు కరువు మండలాలను ప్రకటించింది. నైరుతి రుతుపవన కాలం, ఖరీఫ్-2026 సీజన్‌లో నమోదైన వర్షపాత లోటును పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలో 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 283 మండలాలను తీవ్ర కరువు, 105 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా వర్గీకరించింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 688 మండలాలు ఉండగా, వాటిలో 388 మండలాలు మాత్రమే కరువు ప్రభావిత జాబితాలోకి వచ్చాయి. రాయలసీమతో పాటు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం ప్రాంతాల్లో వర్షాభావ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఉత్తరాంధ్రలోనూ కొన్ని ప్రాంతాలు కరువు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఖరీఫ్ సీజన్‌లో కరువు పరిస్థితులను అంచనా వేయడానికి ఆగస్టు 31 వరకు నమోదైన వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 53.4 శాతం వర్షపాత లోటు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎల్‌నినో పరిస్థితులు కూడా వర్షాభావానికి కారణమైన అంశాల్లో ఒకటిగా కరువు నిర్ధారణ కమిటీ ప్రస్తావించింది. . 8వ వేతన సంఘం ఆలస్యం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ బకాయిలు (అరియర్స్) దక్కే అవకాశం!
కరువు మండలాల గుర్తింపు ప్రక్రియలో వర్షపాత వ్యత్యాసం, వరుసగా వర్షం లేని రోజుల వ్యవధి, పంటల సాగు విస్తీర్ణం, వృక్ష సంపద పరిస్థితి, భూమిలో తేమ, జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వరుసగా మూడు నుంచి నాలుగు వారాల పాటు తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాలను కూడా కరువు తీవ్రత నిర్ధారణలో పరిగణించారు.
జిల్లా కలెక్టర్ల నుంచి కరువు మండలాల ప్రతిపాదనలు కోరుతూ ప్రభుత్వం సెప్టెంబర్ 18న మెమో జారీ చేసింది. అనంతరం వచ్చిన ప్రతిపాదనలను సెప్టెంబర్ 30న వర్చువల్‌గా జరిగిన కరువు నిర్ధారణ కమిటీ సమావేశంలో పరిశీలించారు. కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది.
కరువు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం ఖరీఫ్ కరువును అక్టోబర్ 31లోగా ప్రకటించాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ ప్రారంభంలోనే కరువు మండలాలను ప్రకటించడం ముందస్తు ప్రకటనగా పేర్కొంది. అయితే వర్షపాత లోటు ఆగస్టు నాటికే స్పష్టమైన నేపథ్యంలో ప్రభుత్వం సెప్టెంబర్ చివరి వరకు ఎందుకు వేచి చూసిందనే ప్రశ్నలు రైతు సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.
జూన్ నుంచి వర్షాలు సరిగా లేక పంటలు దెబ్బతింటున్న సమయంలో కరువు ప్రకటన ఆలస్యం కావడం వల్ల రైతులకు అందాల్సిన సహాయం కూడా ఆలస్యం కావచ్చని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రుణాల రీషెడ్యూల్, ఇన్‌పుట్ సబ్సిడీ, అదనపు ఉపాధి హామీ పనిదినాలు, కేంద్ర ప్రభుత్వానికి కరువు నివేదిక వంటి చర్యలు కరువు ప్రకటనతో ముడిపడి ఉంటాయని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో కరువు మండలాల జాబితా, తదుపరి పరిపాలనా చర్యలకు సంబంధించిన ఆదేశాలే ప్రధానంగా ఉన్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా గెజిట్లు విడుదల చేసి, కరువు ప్రభావిత మండలాల వివరాలను అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే ఇన్‌పుట్ సబ్సిడీ ఎంత మేరకు అందుతుంది, పంట నష్టాన్ని ఎప్పటిలోగా అంచనా వేస్తారు, రుణాల రీషెడ్యూల్ ఎలా ఉంటుంది, రైతులకు వడ్డీపై ఏదైనా ఉపశమనం ఉంటుందా, కేంద్రం నుంచి ఎలాంటి సాయం కోరనున్నారు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. పశుగ్రాసం, తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో తీసుకోబోయే చర్యలపైనా రైతులు ఎదురుచూస్తున్నారు.
కరువు ప్రభావం అత్యధికంగా రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో 28, అనంతపురంలో 27, నంద్యాలలో 26, అన్నమయ్యలో 25, చిత్తూరులో 24, కర్నూలులో 15, వైఎస్సార్ కడపలో 14 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా గుర్తించారు. మార్కాపురం జిల్లాలో 19, ప్రకాశంలో 18 మండలాలు తీవ్ర కరువు జాబితాలో ఉన్నాయి.
వైఎస్సార్ కడప జిల్లాలో మొత్తం 37 మండలాలు కరువు జాబితాలో ఉండటంతో ఈ జిల్లాకు అత్యధిక సంఖ్య నమోదైంది. రాయలసీమలోని 186 మండలాలు కరువు ప్రభావిత జాబితాలో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 159 మండలాలను తీవ్ర కరువు కింద వర్గీకరించింది.
కరువు ప్రభావం రాయలసీమకే పరిమితం కాలేదు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లాలో 22 మండలాలు తీవ్ర కరువు జాబితాలో ఉన్నాయి. బాపట్ల జిల్లాలో ప్రకటించిన 15 మండలాలూ తీవ్ర కరువు కిందనే ఉన్నాయి. మార్కాపురం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ ప్రకటించిన మండలాలన్నీ తీవ్ర కరువు కేటగిరీలోనే ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోని మండలాలు కూడా కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రకటించిన 24 మండలాలూ తీవ్ర కరువు కిందకు వచ్చాయి. రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం తీవ్ర కరువు జాబితాలో ఉండగా, పల్నాడు జిల్లాలోని అమరావతి మండలాన్ని మధ్యస్థ కరువు కింద గుర్తించారు.
సాగునీటి వసతులకు పేరున్న కృష్ణా డెల్టాలోని కొన్ని ప్రాంతాలూ కరువు జాబితాలోకి రావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. కృష్ణా జిల్లాలో 8 మండలాలను తీవ్ర కరువు, మరో 9 మండలాలను మధ్యస్థ కరువు కింద ప్రభుత్వం గుర్తించింది. కృత్తివెన్ను, బంటుమిల్లి, నాగాయలంక, కోడూరు వంటి డెల్టా చివరి ప్రాంతాల మండలాలు తీవ్ర కరువు జాబితాలో ఉన్నాయి.
రాష్ట్రంలోని మొత్తం 688 మండలాల్లో 388 మండలాలనే కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించడంతో మరో 300 మండలాలు జాబితాలో లేకుండా పోయాయి. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ తమ ప్రాంతాలకు కరువు హోదా దక్కలేదని ఆయా ప్రాంతాల రైతులు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, తిరుపతి వంటి జిల్లాలకు కరువు మండలాల జాబితాలో చోటు దక్కలేదు. అయితే ప్రభుత్వం కరువు నిర్ధారణకు నిర్దిష్ట మార్గదర్శకాలు, వర్షపాతం, పంటల పరిస్థితి, నీటి లభ్యత తదితర ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతోంది.
మొత్తంగా కరువు మండలాల ప్రకటనతో ప్రభుత్వం ఒక కీలక పరిపాలనా ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ, అసలు పరీక్ష ఇప్పుడు రైతులకు అందే సహాయంపైనే ఉంది. కరువు ప్రభావిత మండలాల్లో పంట నష్టాన్ని ఎంత వేగంగా అంచనా వేస్తారు, ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు రుణపరమైన ఉపశమనం ఎప్పుడు అందుతుంది, పశుగ్రాసం-తాగునీటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అన్నదానిపై రైతుల్లో ఆసక్తి నెలకొంది.
(The above story first appeared on LatestLY on Oct 06, 2026 09:41 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

