AP Weather Update: ఏపీ వెదర్ అప్‌డేట్, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీనివల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని, కోస్తాంధ్రలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురవవచ్చని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో అత్యధికంగా 66.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పెంజెరువులో 42.5 మిల్లీమీటర్లు, సోమలింగపాలెంలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ ప్రతికూల వాతావరణం, ఈదురుగాలులు, పిడుగుల ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, భారీ హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు మరియు వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాకుండా సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చిన్న పడవలతో వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ అధికార యంత్రాగం జారీ చేసే సూచనలను విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
(The above story first appeared on LatestLY on Jul 21, 2026 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

