Makar Sankranti 2022: భీమవరం పందెం కోళ్లకు, హైదరాబాద్ పాతబస్తీకి విడదీయరాని అనుబంధం ఉంది, ఏంటో తెలిస్తే షాక్ తింటారు...

కోస్తాంధ్ర, రాయలసీమల్లో సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతారు. వీరి వద్ద శిక్షణ పొందిన కోడిపుంజును తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకమే ఇక్కడకు రప్పిస్తోంది.

Makar Sankranti 2022: భీమవరం పందెం కోళ్లకు, హైదరాబాద్ పాతబస్తీకి విడదీయరాని అనుబంధం ఉంది, ఏంటో తెలిస్తే షాక్ తింటారు...
Pongal 2022

భీమవరం, జనవరి 13 : సంక్రాంతి వచ్చిందంటే చాలు పాతబస్తీలోని బార్కాస్ పరిసరాలలో గాలిపటాల సందడితోపాటు కోడిపుంజుల కూతలు కూడా వినిపిస్తుంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోళ్ల పందాలకు రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. వీటితో హైదరాబాద్ పాతబస్తీకి విడదీయరాని అనుబంధం ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి పోటీలకు కాలు దువ్వే పందెంరాయుళ్ల పంట పండించే కోడిపుంజులు పాతబస్తీ నుంచి ఎగుమతి కావడం విశేషం. పరువు, ప్రతిష్టలే లక్ష్యంగా రంగంలోకి దిగేవారు కదనరంగంలోకి దూకి విజేతలుగా నిలిచే పాతబస్తీ కోడిపుంజుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించడం గమనార్హం.

కోస్తాంధ్ర, రాయలసీమల్లో సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతారు. వీరి వద్ద శిక్షణ పొందిన కోడిపుంజును తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకమే ఇక్కడకు రప్పిస్తోంది. బార్కాస్‌లో ఒక్కో కోడిపుంజు ధర లక్ష రూపాయల వరకు పలకడం విశేషం. అలాగని పహిల్వానులు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఏడాదికి పరిమిత సంఖ్యలో కోడి పుంజులను విక్రయిస్తుంటారు. వీటి కోసం షెడ్డు ఏర్పాటు చేసి ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో పందెం పుంజు లను పెంచి పోషిస్తున్నారు. రెండేళ్ల వయసున్న కోడి పుంజులనే పందానికి వినియోగిస్తారు.

పాతబస్తీలో పహిల్వాన్లు తాము పెంచే పుంజులకు విటమిన్లతో కూడిన ఆహారాన్ని అందిస్తారు. బాదం, పిస్తా, ఆక్రూట్, ఖీమా, ఉడికించిన గుడ్డు ఆహారంగా ఇస్తారు. ప్రత్యేక ఆహారంతోపాటు కదనరంగంలో విజేతగా నిలిచేలా అన్ని రకాల తర్ఫీదునిస్తారు. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన శిక్షకులతో రెండు పూటలా మసాజ్‌లు చేయిస్తారు. చురుగ్గా పరిగెత్తడం సాధన చేయిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాల్లోని కొందరు పహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. వీటికి అనారోగ్యం దరి చేరకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రత్యేక ఎన్‌క్లోజర్ల మాదిరిగా చిన్నచిన్న గూళ్లను ఏర్పాటు చేసి మినీ జూపార్కును తలపించేలా మూగజీవాల పెంపకంలో పహిల్వాన్ల కుటుంబాలు నిమగ్నమయ్యాయి. ఇంత శ్రద్ధగా పహిల్వాన్లు పెంచే పందెం కోళ్లు తమ సత్తా చూపి వారికి పేరు తేకుండా ఎలా ఉంటాయి.

(The above story first appeared on LatestLY on Jan 13, 2022 10:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).