CM YS Jagan Davos Tour: సంక్షేమం నుంచి అభివృద్ధి వైపు ఏపీ అడుగులు, దావోస్‌లో పలు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం, ఇంధన రంగంలో 60 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రీన్ ఎనర్జీ
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన (CM YS Jagan Davos Tour) సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు.
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన (CM YS Jagan Davos Tour) సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా రాష్ట్రంలో రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ రెండు ప్రాజెక్టులను అదానీ గ్రీన్ ఎనర్జీ నెలకొల్పనుంది. ఇందులో 3,700 మెగావాట్లు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు కాగా 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇవి అత్యంత కీలకం కానున్నాయి. రెండు ప్రాజెక్టుల (green energy plants) కోసం దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు (Adani group to invest Rs 60,000 crore) చేయనున్నట్లు ఎంవోయూలో పేర్కొన్నారు. తద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం జగన్, అదానీ గ్రూపు (Adani group) సంస్థల అధిపతి గౌతమ్ అదానీల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, అదానీ గ్రీన్ ఎనర్జీ తరఫున ఆశిష్ రాజ్‌వంశీ ఎంవోయూపై సంతకాలు చేశారు.
విద్యారంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. దావోస్‌లో దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సహకారం అందించాలని సీఎం కోరారు. ఏపీలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చించినట్లు అనంతరం ఫ్లోరెన్స్ వెర్జలెన్ తెలిపారు. ఏపీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టడానికి దస్సాల్ సిస్టమ్స్ ఆసక్తిగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త తరహా ఇంధనాలపై కూడా చర్చించామని, త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఫ్లోరెన్స్ తెలిపారు.
Here's AP CMO Tweets
దావోస్: సీఎంను కలుసుకున్న హీరో గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై చర్చలు. హీరో కంపెనీకి అవసరమైన నీటిని కండలేరు నుంచి ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం. pic.twitter.com/16tGtMwZ1u
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 23, 2022
దావోస్:మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెశిడెంట్, సీఈఓ తకీషి హషిమొటోతో సీఎం సమావేశం. కంటైనర్ హబ్, లాజిస్టిక్ రంగాలపై దృష్టిపెట్టాలని కోరిన సీఎం. సానుకూలత వ్యక్తంచేసిన హషిమొటో. కాకినాడలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందుకొస్తున్నామని వెల్లడి. pic.twitter.com/JBtil0IATj
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 23, 2022
దావోస్: భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందంతో సీఎం సమావేశం. ఏపీలో వ్యాపార అవకాశాలపై ముఖ్యమంత్రితో చర్చించిన బృందం. pic.twitter.com/L5Z7RjWsLO
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 23, 2022
విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలో భాగస్వామి కానున్నట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. దావోస్‌లోని ఏపీ పెవిలియన్‌లో టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమై నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు లాంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీతోపాటు 30 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు, 175 స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరిస్తూ వీటిని ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలని కోరారు. ఈ నేపథ్యంలో విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్ మహీంద్రా ముందుకొచ్చింది.
విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా ఇంటర్న్‌షిప్, అప్రెంటిషిప్ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గుర్నానీ స్పందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేందుకు హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీతో కలసి ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. ఇక మహీంద్రా గ్రూపు అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.250 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం దృష్టికి తెచ్చింది. ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.
జపాన్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి కాకినాడలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంసిద్ధత తెలిపింది. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉండటంతో పాటు ఏపీలో కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా లభించే లాజిస్టిక్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై జపాన్‌కు చెందిన లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి ఓ ఎస్‌కే లైన్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులతో సరుకు రవాణాను ఏటా 507 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి సంబంధించి కంటైనర్ హబ్, లాజిస్టిక్ రంగాలపై దృష్టి సారించాలని సీఎం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హషిమొటో కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో వ్యాపార విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అంశాలపై హీరో గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్‌తో సీఎం జగన్ చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హీరో గ్రూపు అథెర్ ఎనర్జీలో ఇప్పటికే 36 శాతం వాటాను కొనుగోలు చేయడమే కాకుండా తైవాన్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ గగొరోలో భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, హీరో గ్రూప్ విస్తరణ అవకాశాలపై చర్చలు జరిగాయి. విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్‌లో భాగంగా పరిశ్రమలకు నీటి వనరులను సమకూర్చడంలో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి కండలేరు నుంచి నీటిని ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.
అంతకుముందు భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్‌తో కూడిన స్విస్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. భారత రాయబారి సంజయ్ భట్టాచార్య కూడా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు.
(The above story first appeared on LatestLY on May 24, 2022 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

