London Jobs Fraud Case: యూకే వీసాల పేరుతో మోసం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్..

లండన్ వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లక్షల రూపాయల మోసానికి పాల్పడిన కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్ అన్నె రమా నందనను పోలీసులు అరెస్ట్ చేశారు.

London Jobs Fraud Case: యూకే వీసాల పేరుతో మోసం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్..
YouTuber Nandana Detained

London Jobs Fraud Case: లండన్ వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లక్షల రూపాయల మోసానికి పాల్పడిన కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్ అన్నె రమా నందనను పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్‌లో నివాసముంటూ ‘నందూస్ వరల్డ్’ (Nandu's World) ఛానెల్ ద్వారా నెటిజన్లలో గుర్తింపు పొందిన రమా నందన సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే, పోలీసులు ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు (Lookout Circular) జారీ అయి ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.

పోలీసులు, బాధితుడి వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ లండన్‌లో ఉంటున్న సమయంలో తన వీసా రెన్యూవల్ కోసం నందన భర్త జాగర్తమూడి మధుకర్ పనిచేస్తున్న డెస్టినీ కన్సల్టెన్సీని సంప్రదించారు. తమకున్న సోషల్ మీడియా గుర్తింపును చూపిస్తూ శివక్రాంతి కుమార్‌కు వీసా రెన్యూవల్‌తో పాటు, అతని భార్యకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) ద్వారా మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. దీంతో వారి మాటలు నమ్మిన శివక్రాంతి 2023లో దశలవారీగా రూ. 15 లక్షలను భారత్‌లోని వారి కన్సల్టెన్సీ ఖాతాకు పంపారు.

డబ్బులు తీసుకున్న తర్వాత సీఓఎస్ ప్రక్రియ నిలిచిపోయిందని, పత్రాలు సరిపోలేదని సాకులు చెప్పారు. అసలు వర్క్ వీసాకు ఎలాంటి గ్యారంటీ లేని సర్టిఫికేట్‌తో తమను మోసం చేశారని గ్రహించిన బాధితుడు నిలదీయగా, కేవలం రూ. 2 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చి చేతులెత్తేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నందన దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేసి, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోమవారం విదేశాల నుంచి శంషాబాద్ చేరుకోగానే నందనను అరెస్ట్ చేశారు.

తనపై వచ్చిన ఆరోపణలను నందన ఖండించింది. తాము ఎవరినీ మోసం చేయలేదని, తమ భర్తకు ఎలాంటి కన్సల్టెన్సీ లేదని చెబుతూ ఒక వీడియో విడుదల చేసింది. దురుద్దేశంతోనే కొందరు తమపై నిందలు వేస్తున్నారని ఆరోపించింది. వీరి చేతిలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మరికొందరు బాధితులు మోసపోయారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితురాలి భర్త మధుకర్ పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

(The above story first appeared on LatestLY on Sep 08, 2026 09:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).