Hyderabad, May 12: ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంతకాలం చల్లగా ఉన్న వాతావారణం ఒక్కసారిగా వేడేక్కింది. రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి జగడం మొదలయింది. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు-నిధులు- నియామకాలు అనే నినాదంతో కాబట్టి సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203 జారీ చేయడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న రాత్రి అత్యవసరంగా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం అన్నారు. ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఏపి ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో సోమవారం విడుదల చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేంధర్, మహమూద్ అలీ, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ సహా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖ సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏదైనా కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అందుకు అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని వెంటనే కె.ఆర్.ఎం.బి.లో ఫిర్యాదు చేస్తాం’’ అని స్పష్టం చేశారు.
‘‘గతంలో ఉన్న వివాదాలను, విభేదాలను పక్కన పెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపికి స్నేహహస్తం అందించింది. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించాను. ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్పూర్తికి ఇది విఘాతం కలిగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదు. ఏపి తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.