ACB Raids in Telangana: ఏసీబీ మెరుపు దాడులు.. ఒకే రోజు ఇద్దరు మహిళా అధికారులను పట్టుకున్న ఏసీబీ అఫిషియల్స్.. ఎక్కడెక్కడ అంటే..

రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహిస్తున్న మెరుపు దాడులు ప్రభుత్వ విభాగాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లంచం అడిగే అధికారులపై పక్కా నిఘా ఉంచుతున్న ఏసీబీ బృందాలు, బాధితుల ఫిర్యాదుల ఆధారంగా వరుస దాడులు చేస్తూ అక్రమార్కులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నాయి.

ACB Raids in Telangana: ఏసీబీ మెరుపు దాడులు.. ఒకే రోజు ఇద్దరు మహిళా అధికారులను పట్టుకున్న ఏసీబీ అఫిషియల్స్.. ఎక్కడెక్కడ అంటే..
ACB Raids in Telangana

ACB Raids in Telangana: రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహిస్తున్న మెరుపు దాడులు ప్రభుత్వ విభాగాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లంచం అడిగే అధికారులపై పక్కా నిఘా ఉంచుతున్న ఏసీబీ బృందాలు, బాధితుల ఫిర్యాదుల ఆధారంగా వరుస దాడులు చేస్తూ అక్రమార్కులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి రూ. లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయిన మరుసటి రోజే, జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న మరో మహిళా అధికారిణి ఏకంగా రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోవడం ఐఏఎస్, మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.  హైదరాబాద్‌కు తాగునీటి ముప్పు.. డిసెంబర్ నాటికే సింగూర్ ఖాళీ.. అత్యవసర ప్రణాళికలతో జలమండలి పరుగులు..

జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోన్‌లో పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) సూపర్‌వైజర్‌గా సేవలందిస్తున్న తులసీరాం సునీత రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఓ భవన నిర్మాణదారుడికి అధికారికంగా లబ్ధి చేకూర్చేందుకు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఆమె ఏకంగా రూ. 8 లక్షల పరిహారాన్ని లంచంగా డిమాండ్ చేసింది. వేధింపులు తాళలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా వ్యూహం ప్రకారం దాడులు నిర్వహించారు.

సోమవారం ఫిర్యాదుదారుడి నుంచి మొదటి విడతగా రూ. 4 లక్షల నగదు తీసుకుంటుండగా ముందస్తుగా మాటువేసిన ఏసీబీ బృందం సునీతను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆమె కార్యాలయంలో చేపట్టిన ఆకస్మిక సోదాల్లో లెక్కల్లో లేని రూ. 2.5 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన సునీతను అరెస్టు చేసి నాంపల్లిలోని అడిషనల్ ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున, భద్రతా కారణాల రీత్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించడం లేదని ఏసీబీ అధికార వర్గాలు ప్రకటించాయి.

మరోవైపు రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి కూడా ఏసీబీ వలలో చిక్కారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అనుమతులు లేదా తనిఖీల విషయంలో లబ్ధి చేకూర్చేందుకు ఆసుపత్రి నిర్వాహకుల నుంచి ఆమె రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీని సంప్రదించడంతో, నిఘా ఉంచిన అధికారులు సోమవారం స్వర్ణకుమారి లంచం నగదు స్వీకరిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నారు. ఈ అవినీతి వ్యవహారంలో ఆమెకు సహకరించిన హెల్త్ ఇన్‌‌స్పెక్టర్ ఎం. శ్రీనివాస్, ప్రైవేట్ డ్రైవర్ మద్దూరి కృష్ణయ్యలను కూడా ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. ముగ్గురిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు కీలక స్థాయి మహిళా అధికారులు భారీ లంచాలు తీసుకుంటూ పట్టుబడటం, లంచగొండుల పట్ల ఏసీబీ అనుసరిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. ఎంతటి ఉన్నతాధికారులైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌ను ఆశ్రయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Oct 06, 2026 07:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).