Telangana: హైడెల్ పవర్ ఉత్పత్తి కోసం దుమ్ముగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష, నీటిపారుదల శాఖ ఒకే రీతిన ఉండాలని సూచన

మేజర్, మీడియం, మైనర్ అనే తేడా లేకుండా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ అంతే ఒకటే విభాగంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులంతా రాబోయే కొద్ది రోజుల్లోనే....

Telangana: హైడెల్ పవర్ ఉత్పత్తి కోసం దుమ్ముగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష, నీటిపారుదల శాఖ ఒకే రీతిన ఉండాలని సూచన
File image of Telangana CM KCR | File Photo

Hyderabad, December 06: తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులు (Telangana Irrigation Projects), సాగునీటి కల్పనపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెంవద్ద అటు జలవిద్యుత్ ఉత్పత్తికి, ఇటు గోదావరి నీటి నిల్వకు ఉపయోగపడే విధంగా బ్యారేజి (Dummugudem Barrage)  నిర్మించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు.

దుమ్ముగూడెం వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉంది. 150 రోజుల పాటు నీటి ప్రవాహం ఉంటుంది. జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఈ సానుకూలతల నేపథ్యంలో 37 టిఎంసిల నీరు నిల్వ ఉండేలా బ్యారేజి, 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వీలైనంత తక్కువ భూ సేకరణతో, నదిలోనే నీళ్లు ఆగేలా బ్యారేజికి డిజైన్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వెంటనే అంచనాలు రూపొందించి, నెలాఖరులోగా టెండర్లు పిలవాలని కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్ మానేరుకు ప్రస్తుతం రెండు టిఎంసిల నీటిని పంపు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రోజుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేయాలని సిఎం నిర్ణయించారు. మిడ్ మానేరుకు మూడు టిఎంసిలు లిఫ్టు చేసి, అక్కడి నుంచి మల్లన్న సాగర్ కు రెండు టిఎంసిలను లిఫ్టు చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పనులకు కూడా ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవాలని, వీటితో పాటు సీతారామ ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులను కూడా పూర్తిచేసేందుకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. కంతనపల్లి బ్యారేజి పనులను వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి కావాలని చెప్పారు.

దుమ్ముగూడెం వద్ద జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి, కాళేశ్వరం నుంచి మూడు టిఎంసిలు ఎత్తిపోయడానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసే ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద అదనంగా ఇంపెల్లర్స్, పంపుసెట్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్లను ఉంచాలని కోరారు.

దుమ్ముగూడెం బ్యారేజి, మిడ్ మానేరుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే పనులకు మొత్తం రూ.13,500 నుంచి రూ.14,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పనులకు సంబంధించి ఆమోదం తీసుకోనున్నారు.

మేజర్, మీడియం, మైనర్ అనే తేడా లేకుండా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ అంతే ఒకటే విభాగంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులంతా రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటి పారుదల విధానాన్ని ఖరారు చేయాలని చెప్పారు. సాగునీటి వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లోనే కేటాయించనున్నట్లు సిఎం వెల్లడించారు.

ఇక కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరందించే ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మిడ్ మానేరుకు మూడు టిఎంసిల నీళ్లు వస్తాయి కాబట్టి పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో బస్వాపూర్ రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి షామీర్ పేట వాగు, మూసీ నది, ఆసిఫ్ నహర్ కు నీటిని తరలించాలని, ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నేరుగా నాగార్జున సాగర్ ఆన్ లైన్ రిజర్వాయర్ అయిన పెద్దదేవుల పల్లి రిజర్వాయర్ కు నీటిని చేర్చాలని సిఎం చెప్పారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో ఈ విధంగా గోదావరి నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించాలని చెప్పారు. ఈ పనులపై సంపూర్ణ అవగాహన వచ్చేందుకు నీటి పారుదల శాఖ అధికారులు, రిటైర్డు ఇంజనీర్లు త్వరలోనే ఈ ప్రాంతాల్లో పరిశీలించాలని కోరారు.

గోదావరి బేసిన్ లో మల్లన్న సాగర్ వద్ద, కృష్ణా బేసిన్ లో పాలమూరు ఎత్తిపోతల పథకం వద్ద నీటి పారుదల శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సిఎం ఆదేశించారు.

(The above story first appeared on LatestLY on Dec 06, 2019 12:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).