Hyderabad Voter List: హైదరాబాద్‌లో పది లక్షల మంది ఓటర్లు మిస్సింగ్.. ఆచూకి తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు.. ఒక్క జూబ్లీహిల్స్‌లోనే 88,933 మంది ఓటర్లు గల్లంతు..
హైదరాబాద్ నగరంలోని ఓటర్ల జాబితాలో 10 లక్షలకు పైగా పేర్లు కనిపించడం లేదన్న ఆరోపణలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ ఆరోపణల మధ్య, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో నమోదు ఫారాలు సమర్పించని వారి పేర్లు ముసాయిదా జాబితాలో లేకపోవచ్చని, అర్హులైన వారు ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Hyderabad Voter List: హైదరాబాద్ జిల్లాలో దాదాపు 10 లక్షల మంది ఓటర్ల ఆచూకీ లభించకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని మొత్తం 47,36,669 మంది ఓటర్లలో ఏకంగా 9,95,315 మంది (21 శాతం) ఏమయ్యారో అధికారులకు స్పష్టత రావడం లేదు. వీరిలో కొందరు మరణించిన వారు ఉండగా.. మిగతా వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం లేదా ఇక్కడి నుండి స్వగ్రామాలకు తిరిగి వెళ్లిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మృతులు పోను మిగిలిన వారిని ఆచూకీ తెలియని ఓటర్ల జాబితాలో చేర్చారు.
ఈ జాబితాలో అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 88,933 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా అంబర్‌పేట నియోజకవర్గంలో 38,208 మంది ఉన్నారు. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉండటంతో ఈ సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అధికారులు, సిబ్బంది ఇళ్లన్నీ తిరుగుతున్నా, రాజకీయ పార్టీలు, ఏజెంట్ల సాయం కోరుతున్నా ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదు. ఇప్పటివరకు కేవలం 27,26,655 మంది (57.56 శాతం) మాత్రమే ఫారాలు భర్తీ చేసి ఇవ్వగా.. వారి వివరాలను డిజిటలైజ్ చేశారు. ఫారాల సమర్పణ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించినందున.. ఇకపై వచ్చే ఫారాల సంఖ్య స్వల్పంగానే ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు జిల్లాలోని ఓటర్లలో 4,91,236 మంది (10.37 శాతం) ఆన్‌లైన్ ద్వారా తమ ఎన్యూమరేషన్ ఫారాలను భర్తీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం రాజకీయ నేతల ఇళ్లు, మతపరమైన ప్రదేశాలు, ఇతర సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉండకూడదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 94 భవనాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఇతర ప్రాంతాలకు మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి.. రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. నిబంధనల ప్రకారం 'నామెన్‌క్లేచర్' మార్చాల్సిన పోలింగ్ కేంద్రాలు 39 ఉన్నట్లు గుర్తించారు.
ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న 71 పోలింగ్ కేంద్రాలను రద్దు చేయడం లేదా ఇతర కేంద్రాల్లో విలీనం చేయడానికి ప్రతిపాదించారు. అదే సమయంలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియతో జిల్లాలో ప్రస్తుతం ఉన్న 4,062 పోలింగ్ కేంద్రాల సంఖ్య 67 తగ్గి.. చివరికి 3,995 కేంద్రాలకు చేరనుంది.
(The above story first appeared on LatestLY on Aug 06, 2026 04:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

