Hyderabad Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రాజధాని హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా ఉదయం సమయంలో వర్షం ఒక్కసారిగా దంచికొట్టడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. కేవలం స్వల్ప వ్యవధిలోనే భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో డ్రైనేజీ వ్యవస్థలు పొంగిపొర్లి, రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. దీనివల్ల నగరంలోని దాదాపు అన్ని ప్రధాన మార్గాల్లోనూ వాహనాల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. గంటల తరబడి ప్రయాణికులు, ఉద్యోగస్తులు రోడ్లపైనే చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలపైనా ఈ వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఐటీ కారిడార్‌గా పేరొందిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, సికింద్రాబాద్, బేగంపేట్, మణికొండ , కాచిగూడ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. నీటి ఉధృతికి కొన్నిచోట్ల ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడగా, పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది.
పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా), జీహెచ్‌ఎంసీ మాన్సూన్ బృందాలు , డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిఆర్ఎఫ్) సిబ్బంది నగరవ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టారు. రహదారులపై నిలిచిన నీటిని తొలగించడం, విరిగిపడిన చెట్ల కొమ్మలను పక్కకు జరపడం , మ్యాన్‌హోళ్ల వద్ద అడ్డంకులను తొలగించే పనులను ఈ బృందాలు వేగవంతం చేశాయి.
నగరంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను ఉద్దేశించి పలు కీలక సూచనలు జారీ చేశారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలగడం వల్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు , పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. నీటితో నిండి ఉన్న రహదారులు, పొంగిపొర్లుతున్న నాలాలు , చెరువుల సమీప ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా వాహనదారులు ప్రయాణించేటప్పుడు రోడ్డుపై నిలిచిన నీటి లోతును అంచనా వేయకుండా వాహనాలను ముందుకు తీసుకెళ్లడం చాలా ప్రమాదకరమని, వేగాన్ని నియంత్రిస్తూ రోడ్లపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నందున పాత భవనాలు, బలహీన నిర్మాణాలు, చెట్లు , విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరించారు.
వర్ష పరిస్థితులపై సిటీ పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ జరుపుతోందని, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ , విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు అందిస్తున్నామని సీపీ వివరించారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను, పుకార్లను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ఆపద తలెత్తితే వెంటనే 'డయల్–100'కు కాల్ చేయాలని సూచించారు. ప్రజల ప్రాణరక్షణే ప్రభుత్వానికి ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు.