Rajiv Gandhi Statue War: రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించే మగాడెవడో రండి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, తెలంగాణ తల్లిని మళ్లీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటన

తెలంగాణ సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహమా? అంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Rajiv Gandhi Statue War: రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించే మగాడెవడో రండి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, తెలంగాణ తల్లిని మళ్లీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటన
Revanth Reddy vs KTR (photo-FB)

Hyd, Sep 16: తెలంగాణ సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహమా? అంటూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. రండి... విగ్రహాన్ని ఎవడొచ్చి తొలగిస్తాడో నేను కూడా చూస్తా... మాపై నోరు జారితే ఫాంహౌస్ లో జిల్లేళ్లు మొలిపిస్తా అని బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తామే పెడతామని స్పష్టం చేశారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. తెలంగాణను మొత్తం దోచుకోవాలి, తామే దోచుకోవాలని కేసీఆర్ కుటుంబం భావిస్తోందని, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడతారని వాళ్లు ఊహించలేదని అన్నారు. ఆయన ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఫాంహౌస్ లో ఆయనకు రెగ్యులర్ గా షాక్ ట్రీట్ మెంట్ లు జరుగుతున్నాయి. ఎందుకంటే... అధికారం పోయింది, ప్రజాపాలన వచ్చింది, గడీలు బద్దలైపోయాయి, ఇవాళ వాళ్ల బతుకులు దివాలా తీశాయి అనే వాస్తవాలు ఆయనకు ఇంకా అర్థం కావడం లేదు.

తెలంగాణలో అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు, కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ లోపల కొంతమంది చిల్లరమల్లరగాళ్లను మాపై మాట్లాడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలకేయ ముఠా మళ్లీ గ్రామాల మీదికి రాబోతోంది" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు మదం దిగలేదని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబ పాలన అని విమర్శిస్తున్నారని... మరి కేసీఆర్ సీఎంగా, కొడుకు, అల్లుడు మంత్రులుగా వ్యవహరించలేదా అని ప్రశ్నించారు. త్యాగం అంటే సోనియా గాంధీది... వీళ్లు చేసింది కూడా ఓ త్యాగమేనా? అని పేర్కొన్నారు.

వారసత్వ రాజకీయాలు అని పదే పదే అంటున్నారు... తండ్రిని అడ్డుపెట్టుకుని కొందరు పదవులు పొందలేదా? అని రేవంత్ నిలదీశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ పదవి కూడా చేపట్టలేదని వివరించారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని వెల్లడించారు. కంప్యూటర్లు రాకపోతే సిద్ధిపేటలో ఇడ్లీ, వడ అమ్ముకునేవాళ్లని ఎద్దేవా చేశారు.అవినీతిపరులకు గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. ఎక్స్ లో ట్వీట్ చేసేవాళ్లు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎవరి విగ్రహాలు పెట్టినా ఊరుకునేది లేదని కేటీఆర్‌ గతంలోనే తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్‌ విగ్రహాన్ని తొలగించి.. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠామని స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Sep 16, 2024 07:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).