COVID in Telangana: తెలంగాణలో 10 లక్షలు దాటిన కొవిడ్ టెస్టుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 2579 పాజిటివ్ కేసులు నమోదు, జిల్లాల్లో విజృంభిస్తున్న వైరస్

గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 770 కు పెరిగింది....

COVID in Telangana: తెలంగాణలో 10 లక్షలు దాటిన కొవిడ్ టెస్టుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 2579 పాజిటివ్ కేసులు నమోదు, జిల్లాల్లో విజృంభిస్తున్న వైరస్
Coronavirus Outbreak (Photo Credits: IANS)

Hyderabad, August 25:  తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 10 లక్షలు దాటింది, ఒకరోజులో నిర్వహించే పరీక్షల సంఖ్య కూడా గతంలో కంటే రెండు నుంచి మూడింతలు పెంచారు. అయినప్పటికీ కొత్తగా నిర్ధారించబడే పాజిటివ్ కేసులు గతంలో తక్కువ టెస్టులు నిర్వహించినప్పుడు ఏ విధంగా అయితే వచ్చేవో, ఇప్పుడు కూడా అదే స్థాయిలో రావడం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 52,933 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2579 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 763 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,21,054 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,08,670కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 295 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 106 , రంగారెడ్డి జిల్లా నుంచి 186, మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 30 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా వచ్చే కేసుల సంఖ్య గతంలో కంటే తగ్గుతూ పోతుంటే, జిల్లాల్లో మాత్రం పెరుగుతూ పోతున్నాయి. పలు జిల్లాల నుంచి ప్రతిరోజు వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం నుంచి 161,  వరంగల్ అర్బన్ నుంచి 143, నిజామాబాద్ నుంచి 142, నల్గొండ నుంచి 129, కరీంనగర్ నుంచి 116, మంచిర్యాల నుంచి 104 మరియు సిద్ధిపేట నుంచి 92 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలలోని కేసులను పరిగణిస్తే ఆ సంఖ్య మరింత పెద్దగా ఉంటుంది.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

ఆగష్టు 24న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 770 కు పెరిగింది.

అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 1752 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 84,163 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,737 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 25, 2020 09:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).