హైదరాబాద్, డిసెంబర్ 6 : దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై విచారణ జరుపుతున్న సిర్పూర్కర్ కమిషన్ ఆదివారం ఎన్ కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించింది. మానవ హక్కుల సంఘాల దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ కమిషన్‌ను నియమించింది. సిర్పూర్కర్ కమిషన్ ఈ ఎన్‌కౌంటర్ పై విచారణ చేస్తుంది. దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురైన షాద్‌నగర్‌కు సమీపంలోని చటాన్‌పల్లి ప్రాంతాన్ని సిర్పూర్కర్ కమిషన్ పరిశీలిచింది. ఇదే ప్రాంతంలో 2019 నవంబర్27న బాధితురాలు దిశపై నలుగురు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. మృతదేహం గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి కాల్చారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారులతో పాటు నాటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ కూడా కమిషన్ విచారించింది. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుంది. కాల్పులకు ఎవ్వరూ ఆదేశాలు జారీ చేశారని కూడా కమిషన్ సభ్యులను ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను ప్రశ్నించింది.
షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌ను కమిషన్ సభ్యులు పరిశీలించారు. దిశపై అత్యాచారం చేసిన మహ్మద్ అరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు 2019 డిసెంబర్ 6న ఎన్‌కౌంటర్‌లో మరణించారు.దిశపై అత్యాచారం హత్య చేసిన ఘటన స్థలంలో సీన్ రీ కన్‌స్ర్టక్షన్ చేసే సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని అప్పట్లో సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ పై హక్కుల సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన సుప్రీం కోర్టు వారంలోపులోనే సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు సుప్రీం కోర్టు మాజీ రిటైర్డ్ జడ్జి సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తున్నారు. సీబీఐ మాజీ చీఫ్ డిఆర్ కార్తికేయన్, ముంబై హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఈ కమిటిలో సభ్యులుగా ఉన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు కమిషన్ తన నివేదికను సుప్రీం కోర్టుకు అందజేయనుంది.