Telangana Rain Alert: తెలంగాణ ప్రజలకు వాతావరణ అలర్ట్.. మరో గంటలో భారీ వర్షాలు కురిసే అవకాశం..హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచన..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Telangana Rain Alert: తెలంగాణ ప్రజలకు వాతావరణ అలర్ట్.. మరో గంటలో భారీ వర్షాలు కురిసే అవకాశం..హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Hyderabad Rains

Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో సాధారణ జనజీవనం ప్రభావితమవుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు యానాంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు..

ఈ ప్రాంతాల్లో వచ్చే మూడు గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షంతో పాటు పిడుగులతో కూడిన ఉరుములు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, పిడుగులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో శనివారం తెల్లవారుజాము నుంచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ప్రధాన రహదారిపై పెద్దఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలోనూ ఉదయం నుంచే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇక తెలంగాణలోనూ శనివారం తెల్లవారుజాము నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ, వరంగల్, జనగామ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్ ప్రాంతాలకు కూడా వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రానున్న గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్, ఆమనగల్ ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లాలోని ఘట్టుప్పల్, మునుగోడు, చండూరు, నల్గొండ పట్టణం, కంగల్, నాంపల్లి ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అనంతరం సూర్యాపేట వైపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని, ముఖ్యంగా ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల సమీపంలో ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు కూడా అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు. అల్పపీడనం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న గంటల్లో వర్షాల తీవ్రత, విస్తృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 12, 2026 12:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).