Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
Rain and Cold Wave (photo-ANI)

Vjy, Dec 18: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయింది.

అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యానాంలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పడతాయని తెలిపింది.

నేడు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కడప, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నాలుగుజిల్లాల ప్రజలు నేడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, ఉదయాన్నే బయటకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిక

బుధవారాలు, గురువారాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు నదులు, కాల్వలు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు శనివారం వరకూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు బలంగా ఉండడంతో కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల వరి, పత్తి, పొగాకు రైతులు అప్రమత్తంగా ఉండాలని, కోతలు వాయిదా వేసుకోవాలని, పొలాల్లో ఉంచిన కుప్పలను సంరక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అల్పపీడనం నేపథ్యంలో ఈనెల 25వ తేదీ వరకూ దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

తెలంగాణపై చలిపంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ లో 6.3 డిగ్రీలుగా నమోదు.. 12 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌

మరోవైపు ఉత్తరకోస్తా, తెలంగాణకు ఆనుకుని ఉన్న కోస్తా జిల్లాల్లో చలితీవ్రత కొనసాగింది. బుధవారం చలి తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఇక మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం అరకులోయలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జి.మాడుగులలో 6.5, జీకే వీధిలో 7.2, హుకుంపేట, చింతపల్లిల్లో 7.4, ముంచంగిపుట్టులో 9.7, పెదబయలులో 10.3, అనంతగిరిలో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండడంతో ఏజెన్సీలో పొగమంచు కురవలేదు. అయినా, చలి తీవ్రత తగ్గలేదు.

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలైంది, ఉదయం 10 గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గలేదు, దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.

హైదరాబాద్‌లోనూ చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలకు పడిపోయింది, పటాన్‌చెరులో 7 డిగ్రీలు, మెదక్‌లో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌ 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో గ్రేటర్‌ పరిధిలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు గ్రేటర్‌లో ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, వికారాబాద్‌ జిల్లా బంట్వారంలో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అటు సంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న జహీరాబాద్‌ మండలం సత్వార్‌లో కనిష్ఠంగా 6.6 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌ మండలం అర్లి(టి)లో అత్యల్పంగా 6.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి తట్టుకోలేక ప్రజలు చలిమంటలు ఏర్పాటు చేసుకుంటున్నారు.చిన్నపిల్లలు, సీనియర్‌ సిటిజన్లు చలిగాలుల బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్నివస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్‌, మెదక్‌ జిల్లా సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత అంతకంతకూ పెరిగింది. 11 నుంచి 12 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రానున్న రెండు రోజులలో చలి పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని సూచనలిచ్చింది.

(The above story first appeared on LatestLY on Dec 18, 2024 03:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).