Water Row: రైతుల కోసం దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం, నీటి వాటాలపై ఎలాంటి రాజీ లేదు, తెలంగాణ ఉద్యమమే నీటితో ముడిపడి ఉంది; అధికారులతో సమావేశంలో టీఎస్ సీఎం కేసీఆర్
తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై....
Hyderabad, October 1: తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ జల వివాదాలకు సంబంధించి ఈనెల 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై గురువారం ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కేసీఆర్ పలు ఖచ్చితమైన సూచనలు చేశారు.
తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొన్నదని, పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై ఈనెల (అక్టోబర్) 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇదివరకే ఒక దఫా సమావేశం నిర్వహించిన సీఎం, నేడు మరోసారి అధికారులతో సమావేశమై అపెక్స్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈరోజు ఖరారు చేశారు. 'ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది, దీటుగా జవాబివ్వండి'
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు అబ్రహం, సురేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంఓ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్.కే. జోషి తదితరులు పాల్గొన్నారు.
(The above story first appeared on LatestLY on Oct 01, 2020 09:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

