LinkedIn Jobs Report: ఉపాధి అవకాశాల్లో దూసుకుపోతున్న విశాఖపట్నం.. లింక్డ్‌ఇన్ జాబితాలో అగ్రస్థానం.. టాప్ టెన్ నాన్-మెట్రో నగరాలు ఇవే..
ఉద్యోగం, ఉపాధి అనగానే నిరుద్యోగులకు ముందుగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ వంటి టైర్-1 మెట్రో నగరాలే గుర్తుకువస్తాయి. అయితే ఇటీవలి కాలంలో నాన్-మెట్రో నగరాలు కూడా వేగంగా ఎదుగుతూ, ప్రతిభకు తగ్గ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వేదిక 'లింక్డ్‌ఇన్' తాజాగా వెల్లడించింది.
LinkedIn Jobs Report:
దేశంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టాప్-10 నాన్-మెట్రో నగరాల జాబితాను సిటీస్ అండ్ ద రైజ్ (Cities on the Rise) పేరుతో నివేదిక రూపంలో తాజాగా లింక్డ్‌ఇన్ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, నాన్-మెట్రో విభాగంలో అత్యంత వేగంగా ఉద్యోగావకాశాలు విస్తరిస్తున్న నగరాల వరుసలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మొదటి స్థానంలో నిలిచింది.
టైర్-1 నగరాల తర్వాత అత్యంత వేగంగా కార్పొరేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. మెరుగైన ఉపాధిని కల్పిస్తున్న నగరంగా విశాఖ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ జాబితాలో విశాఖపట్నం తర్వాతి స్థానాల్లో రాంచీ, విజయవాడ, నాసిక్, రాయ్‌పూర్, రాజ్‌కోట్, గ్వాలియర్, ఆగ్రా, జమ్మూ, వారణాసి నగరాలు నిలిచాయి.
నాన్-మెట్రో నగరాల్లో మౌలిక వసతులు, నిర్మాణాలు వేగంగా అభివృద్ధి చెందడం, ఆపరేషనల్ ఖర్చులు తక్కువగా ఉండటం, టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాలు భారీగా విస్తరించడం ఈ నగరాల ఎదుగుదలకు ప్రధాన కారణాలని నివేదిక విశ్లేషించింది.
విశాఖతో పాటు విజయవాడ, వారణాసి, నాసిక్ వంటి పట్టణాల్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో నియామకాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, సేల్స్, ఆపరేషనల్ విభాగాల్లో ఉద్యోగావకాశాలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న భారతీయ నిపుణులు, ఉపాధి కోసం సొంత ప్రాంతాలను విడిచి దూరంగా ఉన్న మెట్రో నగరాలకు వెళ్లడం కంటే తమ స్థానిక ప్రాంతాల్లోనే ఉంటూ పనిచేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని లింక్డ్‌ఇన్ నివేదిక తెలిపింది.
(The above story first appeared on LatestLY on Jul 22, 2026 05:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

