Paytm Shares: ఆదిలోనే హంస పాదు, స్టాక్మార్కెట్‌లో పేటీఎంకు దక్కని ఆదరణ, ఇష్యూ ధర కంటే తక్కువ పలికిన షేర్

ఎన్నో అంచనాలతో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన పేటీఎంకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్‌మార్కెట్లలోకి అడుగుపెట్టిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్ ఇష్యూ ధర కంటే 9శాతం తక్కువతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.

Paytm Shares: ఆదిలోనే హంస పాదు, స్టాక్మార్కెట్‌లో పేటీఎంకు దక్కని ఆదరణ, ఇష్యూ ధర కంటే తక్కువ పలికిన షేర్
Paytm (Photo credit: PTI)

Mumbai November 18: ఎన్నో అంచనాలతో  స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన పేటీఎంకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్‌మార్కెట్లలోకి అడుగుపెట్టిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ ఇష్యూ ధర కంటే 9శాతం తక్కువతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.

స్టాక్‌ మార్కెట్లలో పేటీఎం షేరు ఇష్యూ ధరను రూ.2,150గా నిర్ణయించారు. అయితే ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర కంటే 9.30శాతం తక్కువగా రూ.1950తో లిస్ట్ అయ్యింది. అటు బీఎస్‌ఈలోనూ 9శాతం తగ్గి రూ.1,955 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పేటీఎం షేర్లు మరింత కుంగి 23శాతం నష్టంతో ట్రేడ్‌ అయ్యాయి. అయితే, షేర్ల ధర తగ్గినప్పటికీ, కంపెనీ మార్కెట్‌ విలువ లక్ష కోట్లు దాటింది.

భారీగా నిధుల సమీకరణే లక్ష్యంగా పేటీఎం ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కు చాలా తక్కువ స్థాయిలో స్పందన లభించింది. ఈ ఐపీఓకు 1.89 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు వచ్చాయి. కేవలం భారత్‌లోనే కాకుండా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇదే అతిపెద్ద ఐపీఓ. దీని కంటే ముందు మన దేశంలో 2010లో కోల్‌ ఇండియా తీసుకొచ్చిన రూ.15,200 కోట్ల ఐపీఓనే ఇప్పటి వరకు అతిపెద్దది.

వన్‌97కమ్యూనికేషన్స్‌ను 2000లో ప్రారంభించారు. తొలుత మొబైల్‌ టాప్‌-అప్‌లు, బిల్లు చెల్లింపుల సేవల్ని అందించేది. 2009లో డిజిటల్‌ చెల్లింపుల నిమిత్తం ప్రారంభించిన పేటీఎం మొబైల్‌ యాప్‌తో కంపెనీ రూపురేఖలే మారిపోయాయి. అనతికాలంలో దేశంలో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులకు ప్రధాన డిజిటల్‌ మాధ్యమంగా మారింది. ప్రస్తుతం పేటీఎంకు 333 మిలియన్లకు పైగా వినియోగదారులు, 21 మిలియన్లకు పైగా నమోదిత వ్యాపారులు ఉన్నారు. కంటర్‌ బ్రాండ్జ్‌ ఇండియా 2020 నివేదిక ప్రకారం పేటీఎం బ్రాండ్‌ విలువ 6.3 బిలియన్ డాలర్లు. ఏటా 114 మిలియన్ల మంది దీనిలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 18, 2021 06:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).